ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కామారం అడవుల్లో పులి సంచారం ఏజెన్సీ వాసులను హడలెత్తిస్తోంది. నవంబరు 8న సోమవారం రాకాసి గుట్ట సమీపంలో గడ్డి మేస్తున్న పశువుల మందపై పులి ఒక్కసారిగా విరుచుకుపడింది. వాటిని వేటాడేందుకు వెంబడిస్తుండగా... అదే సమయంలో పశువుల కాపర్లు శబ్దాలు చేయడంతో..... పులి వెనుదిరిగింది. మళ్లీ కొంతసేపటికే రెండుసార్లు పశువులపై దాడికి యత్నించగా కాపర్లు పెద్ద పెట్టున కేకలు వేయడంతో.. అడవిలోకి పులి పరుగులు తీసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్ధలికి వెళ్లి విచారించి పులి సంచారాన్ని నిర్ధారించారు. పులి తిరుగుతున్న రాకాసి గుట్ట గ్రామస్థులు అడవుల్లోకి వెళ్లవద్దని.. పులికి ఎట్టిపరిస్ధితుల్లోనూ హాని తలపెట్టవద్దని హెచ్చరించారు. తాజాగా మంగళవారం ఉదయం మంగపేట మండలం కొత్తూరు మెట్లుగూడం సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి.. ఓ లేగదూడను చంపేసింది.
గోదారి దాటి
పులి సంచారంతో మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయ్, గోవిందరావుపేట మండలాల్లోని అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న గ్రామస్థులు భయాందోళనలు చెందుతున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోని తాడోబా, ఇంద్రావతి అభయారణ్య ప్రాంతాలనుంచి.... గోదావరి దాటి పులులు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలవైపు వలస వస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో వేటాడేందుకు... ఆవాసాలను ఏర్పరుచుకునేందుకు.. గత కొంత కాలంగా ఈ రెండు జిల్లాల అటవీ ప్రాంతాలవైపు వీటి రాక మొదలైంది. 29 ఏళ్ల తరువాత పులి ఆనవాళ్లు ములుగు జిల్లా జిల్లాలోనే గతేడాది కనిపించాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామన్ పల్లి అటవీ ప్రాంత పరిసరాల్లో ఇటీవలే పులి సంచారం గ్రామస్థులకు పక్షం రోజుల పాటు.. కంటి మీద కనుకు లేకుండా చేసింది. అక్కడి పత్తి చేలల్లోనూ పులి సంచరించినట్లుగా.... అడుగులు గుర్తించారు.
యానిమల్ ట్రాకింగ్ టీమ్
తాడ్వాయి మండలం కొడిశాల అడవిలో గత నెలలో వేటగాళ్ల ఉచ్చులకు ఓ పులి బలైంది. మళ్లీ ములుగు జిల్లా తాడ్వాయి పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుందన్న సమాచారంతో... అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులికి హానితలపెట్టవద్దని గ్రామస్థులకు తెలుపుతూ.... దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి పశువుల కాపర్లను వెళ్లవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. పులి కనిపించినా... పాదముద్రలు కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. పులి కదలికలను గుర్తించేందుకు... యానిమల్ ట్రాకింగ్ బృందం రంగంలోకి దిగింది. లేగదూడను హతమార్చిన ప్రాంతంలో ఆరు కెమెరా ట్రాప్‌లను కూడా అమర్చారు.
ఇదీ చదవండి: బట్టల షాప్కెళ్లిన పల్సర్ బైక్.. అసలేం జరిగిందంటే?