మన్యంలో తుపాకులు గర్జిస్తున్నాయి. 24 గంటలూ..... విరామమన్నదీ లేకుండా.... అటవీ ప్రాంతాన్ని ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇన్నాళ్లూ బ్యానర్లు, వాల్ పోస్టర్లు వెదజల్లుతూ... తమ ఉనికి కోసం ప్రయత్నిస్తున్న మావోయిస్టులు క్రమంగా చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాలకు వచ్చి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ఈ నెల 10న తెరాస క్రీయాశీలక కార్యకర్త... భీమేశ్వరరావును దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఘటనా స్ధలిలో లేఖ ద్వారా స్థానిక పార్టీ నాయకులకు హెచ్చరికలు చేసి సవాల్ విసిరారు. ఈ ఘటనతో మరింత అప్రమత్తమైన పోలీసులు... అడవుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఫలితంగా.. చాలా రోజుల తర్వాత మళ్లీ ఏజెన్సీ ప్రాంతంలో తూటాలు పేలాయి.
ఎదురుకాల్పుల్లో ఇద్దరు హతం
ఆదివారం మంగపేట అటవీ ప్రాంతంలో.... కొప్పుగుట్ట, ముసలమ్మ గుట్ట ప్రాంతాల్లో.... జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమైయ్యారు. మణుగూరు ఏరియా కమిటీ కమాండర్‌గా పనిచేస్తున్న వెంకటాపురంకు చెందిన రవ్వ రమల్ అలీయాస్ సుధీర్, మరో దళ సభ్యుడు భద్రాద్రి కొత్తగూడెం నివాసి లక్మా పోలీసులు గుర్తించారు. సుధీర్‌పై ములుగు జిల్లాలోనే ఆరు కేసులు ఉన్నాయి. ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా అనేక కేసులు ఉన్నాయి. నాలుగు లక్షల రివార్డు కూడా గతంలో ప్రకటించారు.
4నెలల్లో 8 మంది హతం
2015 సెప్టెంబర్‌లో గోవిందరావుపేట మండలంలో ఎన్ కౌంటర్లో ఇద్దరు హతమయ్యారు. అంతకు ముందు 2010లో తాడ్వాయ్ మండలం అడువుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒకరు చనిపోయారు. 2009లో ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సెంట్రల్ మిలిటరీ కమాండర్ సుధాకర్ రెడ్డి, వెంకటయ్య అలియాస్ నరేష్ మృతి చెందారు. 2015 తర్వాత జిల్లాలో పెద్ద సంఘటనలేవీ జరగలేదు. ఏజెన్సీ ప్రశాంతంగానే ఉంది. అడపా దడపా... వాల్ పోస్టర్లు వెదజల్లడం, ఒకటి రెండు చోట్ల మందుపాత్రలు పెట్టినా... వాటిని పోలీసులు పసిగట్టి తప్పించుకోవడంతో... ఎలాంటి దుర్ఘటనలూ జరగలేదు.
గత రెండు మూడు నెలలగా..... మావోయిస్టులు ములుగు, భూపాలపల్లి, భద్రాద్రికొత్తగూడెం, అసిఫాబాద్ వైపు రాకపోకలు పెంచారు. దీంతో డీజీపీయే స్వయంగా రంగంలోకి దిగి.... ఆసిఫాబాద్‌లో ఐదు రోజులు మకాం వేశారు. ములుగు జిల్లాలో ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించి.. మావోయిస్టుల కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. ఈ నాలుగు నెలల్లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టుల కట్టడి కోసం.. అంతర్రాష్ట్ర ఆపరేషన్లు చేపట్టాలని... ఇటీవలే పోలీసు అధికారులు నిర్ణయించారు. ఇదే సమయంలో పది రోజుల క్రితం... వెంకటాపురం మండలం బోదాపురం గ్రామంలో తెరాస కార్యకర్తని చంపి ఘాతుకానికి పాల్పడి ములుగు జిల్లా పోలీసులకు మావోయిస్టులు సవాల్ విసరగా... మంగపేట ఎదురుకాల్పులతో పోలీసులు గట్టి సమాధానమిచ్చారు. మావోయిస్టులు దుశ్చర్యలను అడ్డుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటూ గిరిజనులను ఇబ్బందుల పాల్చేస్తున్నారని.. సరిహద్దు జిల్లాల్లో సంయుక్తంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని... అవసరమైతే పొరుగు రాష్ట్రాల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు.
భారీ పోలీస్ బలగాలను మొహరించి... అటవీ ప్రాంతంలో రేయింబగళ్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో... మావోయిస్టుల జాడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనుమానితులు, సానుభూతిపరులపై నిఘా పటిష్టం చేశారు. పరస్పర చర్యలతో... ఏజెన్సీలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయోనని గిరిజనుల్లో భయాందోళన నెలకొంది. పరిస్థితులు చూస్తుంటే ముందు ముందు ఈ తరహా దాడులు, ఎదురుకాల్పుల ఘటనలు ఇక ఎక్కువైయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఇదీ చూడండి: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం