ఆదివాసీ సంప్రదాయలకు నెలవైన మేడారం జాతరకు ఏటికేడు భక్తుల సంఖ్య పెరుగుతోంది. పల్లెలు, పట్నాలు, నగరాలన్న తేడా లేకుండా అందరూ జాతరకు విచ్చేస్తున్నారు. జాతర జరిగే నాలుగు రోజులు వనమంతా జనంగా మారిపోతుంది. జంపన్నవాగు పరిసరాలు... జనసంద్రంగా మారుతాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, జార్ఘండ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో మేడారానికి విచ్చేస్తున్నారు.
తెలంగాణ కుంభమేళ
కేవలం ఆదివాసీలు, గిరిజనులే కాదు... అమ్మలపై నమ్మకం ఉన్న అందరూ మేడారానికి విచ్చేస్తున్నారు. జాతర జరిగేది నాలుగురోజులైనా... అంతకు నెల రోజుల ముందు నుంచి కోలాహలం మొదలవుతుంది. సమ్మక్క ఆగమనం రోజున.. అది పతాక స్థాయికి చేరుకుంటుంది. కోటిన్నరకు పైగా భక్తులు వచ్చే జనజాతరగా మేడారం జాతర ప్రసిద్ధికెక్కింది. తెలంగాణ కుంభమేళాగా కూడా అవతరించింది.
ఆనాటి నుంచి పెరిగిన ప్రాముఖ్యత
జాతరకు ఎన్ని విశిష్టతలున్నా.. జాతీయ పండుగ హోదా రాకపోవడం ఎప్పుడూ వెలితిగానే ఉంటోంది. జాతరలు వస్తున్నాయి... పోతున్నాయి.. తప్ప జాతీయ పండుగ హోదా మాత్రం దక్కట్లేదు. జాతరకున్న ప్రాముఖ్యతను గుర్తించి.. రాష్ట్ర ప్రభుత్వం 1996 ఫిబ్రవరి 1న రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఆనాటి నుంచి ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పాటు నిర్వహణను చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతర ప్రాముఖ్యత మరింత పెరిగింది.
బిగ్‌బీతో ప్రచారం
మహా జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాలంటూ రాష్ట్రం నుంచి అనేక సార్లు... కేంద్రం చెంతకు ప్రతిపాదనలు వెళ్లినా... పార్లమెంటులో ప్రస్తావించినా ... పండుగకు హోదా మాత్రం దక్కట్లేదు. జాతరకు దేశవ్యాప్త ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు... జాతరలో జరిగే ముఖ్య ఘట్టాలను లఘుచిత్రాలు తీశారు. ఈసారి కూడా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ స్వరంతో జాతర ప్రాముఖ్యతను జాతీయ స్థాయికి తెచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది.
హోదా దక్కితే.. ఖ్యాతి పెరుగుతుంది
గత జాతర సమయంలో కేంద్రం నుంచి ఓ బృందం వస్తుందని ప్రచారం జరిగినా... అది కార్యరూపం దాల్చలేదు. కోటి మందికి పైగా వచ్చే జనజాతరకు.. జాతీయ హోదా దక్కితే జాతర ఖ్యాతి దేశవ్యాప్తమవుతుంది. నిధులు పెరుగుతాయి. తద్వారా జాతరకు వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించవచ్చు. అధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా మేడారం మారిపోతుంది.
ఇవీ చూడండి: అనుమతి ఇవ్వమంటే.. చెప్పుతో కొట్టిన అధికారిణి