ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పప్కాపూర్ గ్రామంలో బత్తుల మల్లమ్మ(80), ఆమె కొడుకు బత్తుల సమ్మయ్య(60)లు కొన్నిరోజుల కిందట కరోనా బారినపడ్డారు. చికిత్సపై అవగాహన లేక ఇంటి వద్దే ఉండి రెండు రోజుల వ్యవధిలో మృత్యువాత పడ్డారు. వారి బంధువులు, గ్రామస్థులు కరోనా భయంతో దగ్గరికి వెళ్లేందుకే సాహసం చేయలేదు.
తల్లీ కొడుకులకు అంత్యక్రియలు...
మృతుల బంధువురాలు శ్రావణి దిక్కుతోచని స్థితిలో సమత ఫౌండేషన్ ఛైర్మన్ మార్షల్ దుర్గం నగేశ్ని సహాయం కోరింది. ఏటూరునాగారం ఎస్సై తిరుపతి రెడ్డికి చరవాణిలో సమాచారం అందించి తమ పౌండేషన్ సభ్యుడు కొండగొర్ల రాజేశ్‌ని సంఘటన స్థలానికి పంపారు. ఆయన పీపీఈ కిట్లు ధరించి జేసీబీ సాయంతో తల్లి కొడుకులకు వేర్వేరుగా అంత్యక్రియలు నిర్వహించారు.
మనోధైర్యం కల్పిస్తే...
కరోనా సోకిన వారితో ప్రేమగా ఉండాలని, వారిని నిర్లక్ష్యం చేయవద్దని సమత ఫౌండేషన్ ఛైర్మన్ నగేశ్ అన్నారు. మనోధైర్యం కల్పిస్తే బాధితులు త్వరగా కోలుకుంటారని, మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తే గుండెనిబ్బరం కోల్పోయి మరింత అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. మానవతా విలువలను మంటగలిపేలా ప్రవర్తించవద్దని, జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా మృతులకు దహన సంస్కారాలు నిర్వహించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: నందిగ్రామ్ ఫలితాలపై న్యాయపోరాటం