ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర ఐటీడీఏ అతిధి గృహంలో ఉన్నత అధికారులతో కలెక్టర్ సి.నారాయణరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో జరగనున్న మేడారం జాతరకు జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. రోడ్ల నిర్మాణం, తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న మరుగుదొడ్లు, భక్తులకు నీటి వసతులు ఏర్పాట్లు నాణ్యతతో కూడిన పనులు చేయాలని సూచించారు.
ఈ నెలాఖరులోగా జాతర పరిసరాల్లో విద్యుత్ పనులు పూర్తిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులతో అన్నారు. మిగతా అభివృద్ధి పనులు జనవరి 15 లోపే పూర్తి అవ్వాలని తెలిపారు. వచ్చే ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగబోయే మహా జాతరలో ప్లాస్టిక్ రహిత జాతరగా ఏర్పాటు చేయాలని... అందుకోసం ప్రతి ఒక్కరూ సముచితంగా పనిచేయాలని ఆయన అన్నారు.
జాతరలో వ్యాపారం చేసుకుంటున్న వారి దగ్గర ప్లాస్టిక్‌కి సంబంధించిన వస్తువులు ఉన్నట్లయితే వారికి జరిమానా విధించి పేపర్ బ్యాగ్స్ వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పేపర్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసులు మేడారంలో ఎక్కువగా వినియోగం జరిగేలా చూడాలని అధికారులకు తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
ఇవీ చూడండి: ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ఇక అనుమతి తప్పనిసరి