Priyanka Gandhi Fires on BRS and BJP : ప్రత్యేక తెలంగాణ కావాలనే స్వప్నాన్ని మీరు నెరవేర్చుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) అన్నారు. సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం దొరుకుతుందని, ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు ఆగుతాయని అనుకున్నారని తెలిపారు. రాష్ట్రం వస్తే వస్తే... రైతుల జీవితం బాగుపడుతుందని ఆశించారని... కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మీ ఆశలు నెరవేరకుండా చేసిందని ఆరోపించారు. ములుగు జిల్లా రామానుజపురంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Congress Bus Yatra 2023 Started : కాంగ్రెస్ విజయభేరి యాత్రను ప్రారంభించిన రాహుల్‌గాంధీ, ప్రియాంక
మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రియాంక గాంధీ అన్నారు. హస్తం పార్టీ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందని తెలిపారు. రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణను సోనియా గాంధీ (Sonia Gandhi) ఇచ్చారని గుర్తు చేశారు. రాజకీయంగా నష్టమని తెలిసినా.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినట్లు చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం ఆలోచించకుండా రాష్ట్ర ప్రజల కోరిక నెరవేర్చారని ప్రియాంక గాంధీ వివరించారు.
Congress Public Meeting in Mulugu District : తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని ప్రియాంక గాంధీ తెలిపారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌గాంధీ ఎప్పుడూ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించారని అన్నారు. ఇందు కోసమే రాష్ట్రానికి ఎన్నో జాతీయ సంస్థలను ఇచ్చినట్లు గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఒక రోడ్‌మ్యాప్ రూపొందించిందని.. ప్రజల కోసం పార్టీ ఆరు గ్యారెంటీలను (Six Guarantees) తీసుకోవస్తోందని ప్రియాంక గాంధీ వెల్లడించారు.
ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చేలా చెప్తూ గ్యారెంటీ కార్డు ఇస్తున్నామని ప్రియాంక గాంధీ తెలిపారు. కుటుంబంలో మహిళలు ఎంత కష్టపడుతున్నారో తమకు తెలుసని.. గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరిగి ఆడవారు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మహిళల కష్టాలు తీర్చేందుకే రూ.500 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారని ప్రియాంక గాంధీ వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం యువత, ఉద్యోగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలోనూ భారీగా అవినీతి జరుగుతోందని విమర్శించారు. విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు జరగలేదని.. ప్రభుత్వ వర్సిటీలను నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ వర్సిటీలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.
Priyanka Gandhi Speech in Mulugu Public Meeting : నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకుంటామని ప్రియాంక గాంధీ వివరించారు. ప్రత్యేక గల్ఫ్ సెల్ ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని అన్నారు. అన్ని పంటలకు మద్దతు ధరలకంటే ఎక్కువ చెల్లిస్తామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల వ్యవసాయ రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి రైతుకు సంవత్సరానికి ఎకరాకు రూ.15,000 చెల్లిస్తామని.. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12,000 ఇస్తామని ప్రియాంక గాంధీ వెల్లడించారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. గిరిజనులు అంటే ఇందిరాగాంధీ, సోనియాగాంధీకి ఎంతో ఇష్టమని తెలిపారు. గిరిజనుల సంస్కృతిని కాపాడేందుకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంబేడ్కర్ అభయహస్తం కింద దళితులకు రూ.12 లక్షల సహాయం చేస్తామని ప్రియాంక గాంధీ వివరించారు.
ఇందిరమ్మ ఇల్లు కింద ఎస్టీలకు ఇంటిస్థలం, ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఇస్తామని ప్రియాంక గాంధీ వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు 8 లక్షల ఎకరాలు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. 18 ఏళ్లు దాటిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ట్రైబల్ వర్సిటీ, హార్టికల్చర్ వర్సిటీ, ఉక్కు పరిశ్రమ పెడతామని మోదీ హామీ ఇచ్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ సంస్థలను ప్రధాని అమ్ముతున్నారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు.
Priyanka Gandhi Comments on Narendra Modi : భారీ ప్రభుత్వ రంగ సంస్థలను నరేంద్ర మోదీ (Narendra Modi) తన స్నేహితులకు అమ్ముతున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. రైల్వే సహా అనేక సంస్థలను ప్రధాని ఇప్పటికే ప్రైవేట్ పరం చేశారని విమర్శించారు. రూ.7 లక్షల కోట్ల విలువైన సంస్థలను రూ.6 లక్షల కోట్లకే మిత్రులకు ఇచ్చారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని ప్రియాంక గాంధీ ఆక్షేపించారు.
"బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్ మోదీ చేతిలో ఉంది. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, వైన్ మాఫియా రాష్ట్రాన్ని దోచుకుంటోంది. రంగారెడ్డి జిల్లాలోని వేల కోట్ల విలువైన భూములు బీఆర్ఎస్ పెద్దలు దోచుకున్నారు. భూదాన్ భూములను ఆన్‌లైన్‌లో తొలగించి, ఆక్రమించుకున్నారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి.. ప్రజలను మోసం చేశారు. బీఆర్ఎస్ నేతలు వందల కోట్లు లూటీ చేసి భారీ భవనాలు కట్టుకున్నారు. 18 మంత్రిత్వ శాఖలు కేసీఆర్ కుటుంబం దగ్గరే ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ముగ్గురే బీసీ మంత్రులు ఉన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రకారం న్యాయం జరగటం లేదు. కులగణన చేయమంటే మోదీ సర్కార్ ముందుకు రావటం లేదు. ఎవరి జనాభా ఎంత ఉందో తెలియకుండా ఎలా న్యాయం చేస్తారు." - ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
Nizamabad Politics Latest News : కాంగ్రెస్ 'ఆపరేషన్ ఆకర్ష్'తో.. నిజామాబాద్‌లో రంజుకుంటున్న రాజకీయం