ధరణి పోర్టల్ పనితీరు, ప్రక్రియ విధానంపై ములుగు జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికేరి.. భూ విక్రేతలు, కొనుగోలుదారుల స్పందనని అడిగి తెలుసుకున్నారు. ములుగు తహసీల్దార్ కార్యాలయంలో గురువారం పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను పరిశీలించారు.
అవినీతికి ఆస్కారం ఉండదు
ధరణి సేవల అమలు తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రారంభ దశలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం ధరణి పోర్టల్ ద్వారా భూవివాదాలకు తెరపడుతుందని పేర్కొన్నారు. అవినీతికి ఆస్కారం ఉండదని వెల్లడించారు.
ధరణి ద్వారా జరిగే రిజిస్ట్రేషన్ల వివరాలు తహసీల్దార్ కార్యాలయంలో క్లుప్తంగా ఉండాలని, దీనికోసం తప్పనిసరిగా లాగ్‌బుక్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
స్మార్ట్‌ఫోన్ ద్వారా
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. స్లాట్ బుకింగ్‌ను స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చని తెలిపారు. ధరణి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఇదీ చదవండి: చిరిగిన గోతాలను అంటగట్టిన గుత్తేదారులు..