మండమెలిగే పండగ
పెద్ద జాతర జరిగిన మరుసటి సంవత్సరం చిన్నజాతరను నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. దీన్నే మండమెలిగే పండుగగా వ్యవహరిస్తారు. వనదేవతల ఆగమనం లేకపోయినా సమ్మక్క, సారలమ్మ ఆలయాల చెంత శుద్ధి నిర్వహించి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామంలో మామిడాకులు కట్టి నైవేద్యాలు సమర్పిస్తారు. రాత్రిపూట పూజారులు జాగారాలు చేస్తారు. ఇలా నాలుగు రోజులు సందడిగా సాగుతుంది. వచ్చే నెల 24 నుంచి నాలుగు రోజులపాటు చిన్న జాతర జరగనుంది. మేడారం గద్దెల వద్ద సమావేశమైన పూజారులు జాతర తేదీలు, ఆయా రోజుల్లో జరిగే కార్యక్రమాలు ఖరారు చేశారు.
జాగ్రత్తలు తప్పనిసరి
వచ్చేనెల 24న గుడి శుద్ధి, పూజా కార్యక్రమాలతోపాటు ద్వార స్తంభాలు నెలకొల్పడం జరుగుతుంది. 25న అమ్మవార్లకు పసుపు కుంకుమలతో అర్చన చేస్తారు. 26న భక్తులు అమ్మలను దర్శించుకుంటారు. 27న పూజా కార్యక్రమాలు ముగింపు కావడంతో జాతర పరిసమాప్తం అవుతుంది. పెద్ద జాతరకు రాలేని వాళ్లు, మొక్కులు తీర్చుకోలేని వాళ్లు... ఈ జాతరకొచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. గత మార్చి నుంచి కరోనా మహమ్మారి వల్ల అన్ని పండుగలు, జాతరల సందడి తగ్గిపోయింది. కానీ అంతకు నెల ముందుగానే మేడారం పెద్ద జాతర జరిగింది. ప్రస్తుతం కొవిడ్ జాగ్రత్తలతో చిన్న జాతర జరగనుంది.
ఇదీ చూడండి: ఆలయాలను అభివృద్ధి చేయాలి: శ్రీధర్ బాబు