భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ములుగు ఎమ్మెల్యే సీతక్క సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని చెప్పి ఇప్పటివరకు స్పందించలేదని ఆరోపించారు.
ప్రాజెక్టుల పేరుతో అక్కడి నీటిని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ సాగు భూములకు నీరు అందకుండా చేస్తున్నారన్నారు. ఇసుక, బొగ్గు వనరులను తరలిస్తూ అక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక్కడ పారుతున్న వాగుల్లో చెక్‌డ్యాంలు నిర్మించి పేద, చిన్న సన్నకారు రైతులకు నీటి సౌకర్యం కల్పించాలని కోరారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అటవీ చట్టాలు, ప్రభుత్వాలు లేకముందే గ్రామాలున్నాయని... ఇప్పుడు అటవీ చట్టాల పేరిట ఆదివాసీ పేద గిరిజనులకు ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు.