ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన పంట పొలాలను గిరిజన, శిశు, మహిళ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పరిశీలించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో మంత్రి పర్యటించారు. ఆగస్టు రెండో వారం నుంచి కురిసిన భారీ వర్షాలకు రామప్ప సరస్సు మత్తడి పోవటం వల్ల పంట పొలాలు మునిగిపోయాయి. వరద ప్రవాహం వల్ల దెబ్బతిన్న రోడ్డును, రామప్ప సరస్సు మత్తడిని పరిశీలించారు.
నీట మునిగిన పంట వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. మొన్నటి వరకు జలదిగ్బంధంలో ఉన్న పాపయ్యపల్లి గ్రామాన్ని సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్... గ్రామ ప్రజలతో ముచ్చటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.