Minister Mallareddy at Medaram Jatara: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేడారం మహా జాతర సవ్యంగా సాగుతోందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మంత్రి మల్లారెడ్డి.. కేసీఆర్ ప్రధాని కావాలని వనదేవతలను కోరుకున్నట్లు మీడియాతో చెప్పారు. గతంలో తాను కోరిన కోరికలన్నీ అమ్మవార్లు నెరవేర్చారని.. ఎంపీతో పాటు మంత్రి కావాలని వేడుకుంటే అవి జరిగాయని వివరించారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ మేడారం జాతరకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రాకకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
"ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేడారం జాతర సవ్యంగా సాగుతోంది. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు జాతర జరుగుతున్న తీరును తెలుసుకుంటున్నారు. సౌకర్యాల పట్ల భక్తులు కూడా సంతృప్తిగా ఉంటున్నారు. నేడు మేడారానికి కేసీఆర్ రాక దృష్ట్యా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం." ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
అదే కోరుకున్నా
"నేను పదేళ్లుగా అమ్మవార్లను దర్శించుకుంటున్నా. ఇంతవరకూ ఏ కోరిక కోరినా అమ్మవార్లు నెరవేర్చారు. ఒక్కసారి సీఎం కేసీఆర్.. ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నా. అప్పుడు తెలంగాణ రాష్ట్రం లాగానే దేశం కూడా సంక్షేమ పథకాలతో సస్యశ్యామలం అవుతుంది." మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి
మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మలకు ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. జంపన్నవాగులో స్నానాలు చేసి వనదేవతలను దర్శించుకుంటున్నారు. జంపన్నవాగులో స్నానాలు చేయడం ద్వారా తమకు మంచి జరుగుతుందని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Medaram Jatara: వనదేవతలను దర్శించుకున్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, రేణుసింగ్