ములుగు జిల్లాలో కొవిడ్-19 నియంత్రణపై కలెక్టర్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ హాజరయ్యారు. కనబడని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని.. ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని కరుణ సూచించారు.
అధికారులు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సంబంధ సర్వే చేయాలని, లక్షణాలు ఉన్నవారికి వెంటనే పరీక్షలు చేయాలన్నారు. యాక్టివ్ నిఘాతో పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించే అవకాశాలున్నాయని కరుణ పేర్కొన్నారు. ఇంట్లో తగినంత సౌకర్యం లేనివారిని హోం క్వారంటైన్‌కు అనుమతించొద్దని, వారిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించాలన్నారు.
జిల్లాలో 325 యాక్టివ్ కేసులున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య చెప్పారు. ఇంచర్లలో ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రం, ఏటూరునాగారం వైటీసీలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాజేడు మండలంలో మరో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆదిత్య తెలిపారు.
ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్