Kalyana Laxmi story: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థికంగా అండగా ఉన్న కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించడానికి ప్రేరణగా నిలిచిన.. గిరిజన బిడ్డ కల్పన కూతురు చంద్రకళ వివాహం ఈ నెల 24న ఘనంగా జరిగింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వివాహం జరిపించారు. 26న జరిగిన విందుకు హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్.. నూతన దంపతులను ఆశీర్వదించారు. వారికి నూతన వస్త్రాలు కానుకగా అందించారు.
ములుగు జిల్లా రామచంద్రాపురం గ్రామ పంచాయతీ శివారు భాగ్యా తండాలో 2002 మార్చిలో తెలంగాణ ఉద్యమ నేత పర్యటించారు. ఆ సమయంలో తండాకు చెందిన కీమా నాయక్ ఇల్లు అగ్నికి ఆహుతైంది. కూతురు కల్పన పెళ్లి కోసం దాచుకున్న నగదు, బంగారం మొత్తం మంటల్లో కాలిపోయింది. దీంతో బిడ్డ పెళ్లి జరిపించడమెలా అని తండ్రి విలపించారు. ఆ విషయం తెలుసుకున్న కేసీఆర్.. కల్పన వివాహ బాధ్యతను తన భుజాన వేసుకొని పెళ్లి ఖర్చుకు రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించి, అన్ని సమకూర్చి తానే దగ్గరుండి వివాహం జరిపించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. రాష్ట్రంలోని ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా కీమానాయక్ లాగా బాధపడొద్దన్న ఆలోచనతో సీఎం కేసీఆర్.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారు. నాడు కల్పన పెళ్లితో పునాది పడిన ఈ పథకం.. ఈ రోజు ఆమె కూతురు చంద్రకళ పెళ్లికి అండగా నిలిచింది. ఈ ఏడేళ్లలో 10 లక్షల మందికి పైగా ఆడపడుచుల పెళ్లిళ్లకు ఈ పథకం ఆసరాగా నిలిచింది. కేసీఆర్‌పై అభిమానంతో కల్పన దంపతులు తమ పిల్లలిద్దరికీ చంద్రశేఖర్ రావు, చంద్రకళ అని పేర్లు పెట్టుకున్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గ్రామంలో భర్త యాకుబ్‌తో కలిసి వ్యవసాయం చేసుకుంటూ కల్పన కుటుంబాన్ని పోషిస్తోంది. కల్పన దంపతులు ప్రస్తుతం తమ బిడ్డ చంద్రకళకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. వర్దన్నపేట మండలం దుబ్బతండాకు చెందిన బానోతు చందర్‌తో వివాహం నిశ్చయించారు. నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హాల్లో గురువారం రాత్రి 9:20 గం.లకు చంద్రకళ- చందర్ల వివాహాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, స్వప్న దంపతులు సొంత ఖర్చులతో ఘనంగా జరిపించారు. కూతురు పెళ్లి కోసం కల్యాణలక్ష్మి పథకానికి కల్పన దంపతులు దరఖాస్తు చేసుకున్నారు.
శుక్రవారం జరిగిన విందు కార్యక్రమానికి గిరిజన, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. వధూవరులకు నూతన వస్త్రాలను అందించి ఆశీర్వదించారు. వేడుకకు ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, వరంగల్ అడిషనల్ కలెక్టర్‌తో పాటు, పలువురు నేతలు హాజరయ్యారు.
ఇదీ చదవండి: నేత్రపర్వంగా మహాకుంభ సంప్రోక్షణ.. స్వయంభువునికి కేసీఆర్ తొలిపూజ..