పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. పాత జిల్లా నుంచి రెవెన్యూ డివిజన్లు, మండలాలను వేరు చేసి కొత్తవాటికి పురుడుపోసింది. జిల్లా పాలనకు గుండెకాయలాంటి కలెక్టరేట్లను ఏర్పాటుచేసి కలెక్టర్, అదనపు కలెక్టర్లనూ నియమించింది. ఇంత వరకు బాగానే ఉన్నా అవసరమైన పోస్టులను మాత్రం భర్తీ చేయడం లేదు. కొన్ని జిల్లాలకు ఆవిర్భావ సమయంలో ఆర్డర్ టు సర్వ్ కింద కేటాయించిన ఉద్యోగులను నేటికీ క్రమబద్ధీకరించ లేదు. ఒకవైపు సిబ్బంది లేక సేవల్లో ఇబ్బందులు వస్తుంటే.. మరోవైపు పూర్తిస్థాయి నియామకాలు లేక ఉద్యోగులు సతమతమవుతున్నారు.
2019 ఫిబ్రవరిలో మహబూబ్‌నగర్ నుంచి నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి నుంచి ములుగును వేరు చేసి కొత్త జిల్లాలు ఏర్పాటుచేశారు. రెండు జిల్లాలకు 53 చొప్పున కొత్త పోస్టులు మంజూరు చేశారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సగం పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు. ములుగు జిల్లాలో 24 మంది అధికారులు, సిబ్బంది అన్ని రకాల విధులు నిర్వహిస్తూ నెట్టుకొస్తున్నారు. వారిలో 9 మందిని మాత్రమే శాశ్వత ప్రాతిపదికన కేటాయించగా మిగిలిన వారిని ఆర్డీవో కార్యాలయం, ఇతర తహసీల్దారు కార్యాలయాల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకున్నారు. ఈ జిల్లాలో మైదానంతో పాటు అభివృద్ధిలో వెనుకబడిన గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. దాదాపు ఇలాంటి పరిస్థితే నారాయణపేట జిల్లాలోనూ ఉంది. జిల్లాల్లో అన్ని శాఖల పురోగతి, ప్రభుత్వం పథకాల అమలు, నివేదికలు పంపడం, విచారణలు తదితర ప్రక్రియలతో ముడిపడి ఉండే కలెక్టరేట్‌లోని సెక్షన్లు అరకొర సిబ్బందితో నడుస్తున్నాయి.
ఎవరికీ పట్టని ఆర్డర్ టు సర్వ్ యాతన...
2016 దసరా పండుగ రోజు రాష్ట్రంలో ఉన్న పది జిల్లాలను విభజించి కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేశారు. పాత జిల్లా కేంద్రాల్లోని ప్రధాన శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులను ఉన్న అప్పటికప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాకు పంచి ఆర్డర్ టు సర్వ్ విధానంలో బదిలీ చేశారు. భార్యా భర్తల ఉద్యోగాల నిబంధన (స్పౌజ్), వైద్య సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఎటువంటి ఐచ్ఛికాలు ఇవ్వకుండా అప్పటి పరిస్థితుల మేరకు పోస్టింగ్‌లు ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తే అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సర్దిచెప్పారు. కొంత కాలం తరువాత ఐచ్ఛికాలు ఇచ్చి సర్దుబాటు చేస్తామని చెప్పడంతో వారంతా పోస్టింగులు ఇచ్చిన చోట విధుల్లో చేరారు. ఇలా కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులు ఐదేళ్ల నుంచి ఆర్డర్ టు సర్వ్ పేరుతో అక్కడే ఉండిపోయారు. బదిలీలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి పలు మార్లు విజ్ఞప్తి కూడా చేసినా ఫలితం లేకుండా పోయింది.