Medaram Jathara 2022: మేడారం జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మేడారానికి చేరుకున్న భక్తులు మొదట జంపన్న వాగు వద్దకు చేరుకుంటున్నారు. కల్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించి స్నానాలు ఆచరిస్తున్నారు. కొంతమంది భక్తులు జల్లు స్నానాలు చేస్తుండగా.. మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి వాగులో పసుపుకుంకుమలు వేసి పూజలు చేసి పుణ్యస్నానాలు చేస్తున్నారు. అక్కడి నుంచి అమ్మవార్ల దర్శనానికి తరలివెళ్తున్నారు.
జంపన్న వాగుకు ఓ చరిత్ర..
మహాజాతరకు జంపన్నవాగుకు విడదీయలేని బంధం ఉంది. కాకతీయులతో యుద్ధం జరిగిన సమయంలో రోజుల తరబడి పోరాటం చేసిన సమ్మక్క కుమారుడు జంపన్న మేడారం పొలిమేరలో ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణ చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. నాటి నుంచి ప్రజలు ఆ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. భక్తజనులు జంపన్నవాగులో పుణ్యస్నానమాచరించి ఆ తర్వాత తల్లుల దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే పూజారులు, పూనుగొండ్ల నుంచి వచ్చే పగిడిద్దరాజు పూజారులు జంపన్నవాగులో దిగి నడుచుకుంటూ వచ్చి గద్దెల ప్రాంగణానికి చేరుకుంటారు. దశాబ్దాలుగా ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
సందడంతా అక్కడే..
వేకువజామున సూర్యుడి లేలేత కిరణాలు నేలపై ప్రసరిస్తున్న సమయంలో వాగు భక్తజనంతో నిండిపోయే దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్లు చాలవు. రాత్రి వేళ విద్యుద్దీపాల కాంతుల్లో స్నానఘట్టాలు మెరిసిపోతుంటాయి. జంపన్నవాగుకు రెండు వైపులా స్నానఘట్టాలు నిర్మించారు. వాటిపై జల్లు స్నానాలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పూనకాలతో ఊగిపోతూ హోరెత్తిస్తారు. మరోవైపు వీర గోలతో కొందరు మహిళలు భక్తుల వీపులపై చరుస్తూ భయం పోగొట్టే ప్రయత్నం చేస్తారు. వాగు ఒడ్డున పదుల సంఖ్యలో నాగ దేవతల పుట్టలు వెలుస్తాయి. పవిత్ర స్నానాలు చేసిన అనంతరం అక్కడే నాగదేవతలకు పూజలు చేసి తల్లుల దర్శనానికి తరలివెళ్తారు. జాతరను పురస్కరించుకుని జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి ఉన్న జనం కంటే.. ఈరోజు ఉదయం నుంచి భక్తుల రద్దీ ఎక్కువుగా ఉంది. వాగు పరిసరాల్లో ఇసుక వేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు.
క్షురకుల ఆసక్తి...
ఒక్కొక్కరు 100 రూపాయల టిక్కెట్ తీసుకొని తలనీలాలు సమర్పించుకుంటున్నారు. తలనీలాలు సమర్పించే మహిళల కోసం క్షురకులు వేచి చూస్తున్నారు. ఒక్క మహిళ తల నీలాలు సమర్పిస్తే.. ఆ వెంట్రుకలకు 5 నుంచి 6 వేల వరకు వస్తాయని ఆశపడుతున్నారు. వచ్చే డబ్బులో కాంట్రాక్టర్కు సగం ఇవ్వగా.. మిగిలిన మరో సగం క్షురకుడికి వస్తాయి. ఈ జాతర తమకు లాభాలు తెచ్చిపెట్టాలని అమ్మవార్లను క్షురకులు కోరుకుంటున్నారు.
ఇదీ చూడండి: