Bandi Sanjay on Ramappa: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు విషయం రాష్ట్రపతి ప్రసంగంలో ఉండటం సంతోషాన్ని కలిగించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్రంలో దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా రాని గుర్తింపు మోదీ ప్రభుత్వ ప్రయత్నంతో సాధ్యమైందన్నారు.
యునెస్కోలోని 23 సభ్యదేశాల్ని ఒప్పించడంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి కూడా కీలకపాత్ర పోషించారని తెలిపారు. తనతో పాటు తెలంగాణ నుంచి ఎన్నికైన భాజపా ఎంపీల కృషి కూడా ఉందన్నారు. రామప్ప గొప్పతనం గురించి రాష్ట్రపతి దేశప్రజలకు చెప్పడం ద్వారా రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. ఇది మరింత ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందిని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
ఐదుగురు సభ్యులతో కమిటీ: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారపల్లిలో జరిగిన ఘటనపై ఐదుగురు సభ్యులతో కమిటీని బండి సంజయ్ ఏర్పాటుచేశారు. గ్రామానికి వెళ్లి నివేదిక ఇవ్వాలని సూచించారు. బెల్ట్‌షాపుల నిర్వాహకులకు తెరాస అండగా ఉంటోందంటూ భాజపా ఆక్షేపించింది.
సంజయ్‌కు హైకోర్టు ముందస్తు బెయిలు
సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీసు స్టేషన్‌లో గత ఏడాది నమోదైన కేసులో భాజపా ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు సోమవారం హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని, దర్యాప్తు నిమిత్తం పిలిచినపుడు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ముందస్తు బెయిలు మంజూరు చేశారు.