వనదేవతలు సమ్మక్క, సారలమ్మ చిన్నజాతర సమీపించేకొద్ది వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను వేగిరం చేస్తున్నారు. ఈ నెల 24 నుంచి నాలుగు రోజులపాటు జరిగే ఈ ఉత్సవానికి సుమారు 5 లక్షల మంది భక్తులు హాజరు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాల్సిందిగా అన్ని శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇప్పటికే దేవాదాయ, పోలీసు, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్, ఎన్పీడీసీఎల్ అధికారులు పనులు ప్రారంభించారు. దేవాదాయశాఖాధికారులు విడిది గృహాల మరమ్మతులు, తాగునీటి ఏర్పాటు కోసం బోరు వేయించే పనులు చేపట్టారు. వీధి దీపాల ఏర్పాటు, చలువ పందిళ్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జాతర పరిసరాల్లో నిరంతర విద్యుత్తు సరఫరా చేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసే క్రమంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రెవెన్యూ అధికారులు ఇసుక చదును చేయిస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చేతిపంపుల మరమ్మతులకు సంబంధించి సర్వేను పూర్తి చేశారు. గురువారం నుంచి పనులు ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నారు. పోలీసుశాఖాధికారులు ఇప్పటికే బారికేడ్లు ఏర్పాటు చేశారు. చిన్నజాతర నాటికి మరిన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదీ చూడండి: నేటి అర్ధరాత్రి నుంచి నాగోబా జాతర