Medaram Jatara: ములుగు జిల్లా మేడారం మహాజాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జంపన్నవాగులో ఇన్‌ఫిల్‌ట్రేషన్ బావుల్లో పేరుకు పోయిన ఇసుక, పూడికను తీస్తున్నారు. ఆ బావుల్లో పూడిక తీయటం ఎంతో కష్టం.. ఈ బావుల్లో పూడిక తీసేందుకు ఏపీలోని కడప జిల్లా నుంచి 18 మంది అనుభవం ఉన్నవారిని రప్పించారు. ఒక్కో బావిలోకి నలుగురు వ్యక్తులు దిగి.. తాళ్లతో కట్టిన గంపల్లో పూడికను నింపుతున్నారు. బావిపైన ఉన్నవారు తాళ్లతో గంపనుపైకి లాగి బయట పోస్తారు. బావులు 6 నుంచి 9 మీటర్ల లోతు ఉంటాయి. గాలి కూడా సరిగా అందదు. నీరు ఎక్కువయితే నీటిలో మునిగి.. ఊపిరి బిగపట్టి గంపను నింపుతారు. జంపన్నవాగులో 32 బావులుండగా, ఇప్పటికే 18 బావుల్లో పూడిక తీయడం పూర్తి చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. పూడికతీత పనులు పూర్తికాగానే వాటికి మోటార్లు అమర్చి జంపన్నవాగు స్నానఘట్టాల షవర్లకు, తాగునీటి కోసం సరఫరా చేస్తారు.
భక్తులతో కిటకిట..
మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచీ భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటున్నారు. బెల్లం, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, అమ్మవార్లకు చీరలు సమర్పిస్తున్నారు.