ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం చినజాతరకు ముస్తాబైంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు నిలవెత్తు నిదర్శనంగా... ఆదివాసీ ఆచారాలతో నిర్వహించే మేడారం మహా జాతర రెండేళ్లకోసారి అతి వైభవంగా జరుగుతుంది. లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మహాజాతర జరిగిన తదుపరి ఏడాది మాఘ శుద్ధ పౌర్ణమికి నాలుగు రోజుల ముందు.. మండమెలిగే పండుగగా వ్యవహరిస్తూ... పూజారులు చిన జాతరను ఘనంగా నిర్వహిస్తారు.
నెల రోజుల ముందు నుంచే..
గద్దెల వద్ద శుద్ధి నిర్వహించి వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా.... మామిడాకులతో దిష్టితోరణాలు కడతారు. రాత్రి పూట పూజారులు జాగారాలు చేయడం నాలుగు రోజుల పాటు జరుగుతాయి. పెద్ద జాతరకు రాని వాళ్లు తమ మొక్కులు చెల్లించుకోవడం కోసం....ఈ జాతరకు విచ్చేస్తారు. ఈసారి నెల రోజుల నుంచే మేడారానికి భక్తుల రాక మొదలైంది. వారాంతాల్లో విశేషంగా వచ్చిన భక్తజనం జంపన్నవాగులో స్నానాలు ఆచరించి వనదేవతలను దర్శించుకుని పూజాదికాలు నిర్వహించారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు.
ఏర్పాట్లు పూర్తి..
చిన్నజాతరకోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గద్దెల వద్ద భక్తులకు ఎండ తగలకుండా చలువపందిళ్లు వేశారు. కోటి 52 లక్షల వ్యయంతో...జంపన్నవాగు వద్ద స్నానాల కోసం, దుస్తులు మార్చుకునే గదులు, రహదారుల నిర్మాణం, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం, విద్యుత్ సరఫరా తదితర ఏర్పాట్లు చేశారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు అనుగుణంగా హన్మకొండతోపాటు జిల్లాలోని ఇతర డిపోలనుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
ఇదీ చూడండి: నేటి నుంచే 6,7, 8 తరగతులు.. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి