Young Man Brutal Murder in Medchal Today : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడు (18), బాలిక (15) మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో కుటుంబసభ్యులు యువకుడిని పలుమార్లు హెచ్చరించారు. తమ అమ్మాయి వెంట పడొద్దని, ఆమెతో మాట్లాడొద్దని అతడికి బాలిక తల్లిదండ్రులు పలుమార్లు హెచ్చరించారు. మరోసారి తమ అమ్మాయితో కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. అయినా ఆ యువకుడు తన ప్రవర్తన మార్చుకోలేదు. బాలిక తల్లిదండ్రులకు తెలియకుండా తన ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూ వచ్చాడు.
ఈ క్రమంలోనే బుధవారం రోజున బాలిక తల్లిదండ్రులు ఆమెను ఇంట్లో ఒంటరిగా వదిలి పెట్టి పని నిమిత్తం బయటకు వెళ్లారు. వెళ్తూ వెళ్తూ ఇంటిపై ఓ కన్నేసి ఉంచమని చుట్టు పక్కల వారికి చెప్పారు. ఇంట్లో ఎవరూ లేరన్న విషయం తెలుసుకున్న యువకుడు.. రాత్రి సమయంలో బాలిక ఇంటికి వెళ్లాడు. అతడు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకున్న బాలిక తల్లిదండ్రులు అతడిని పట్టుకుని చితకబాదారు. రహస్య భాగాలపై కారం వేసి విచక్షణా రహితంగా చావగొట్టారు. దాదాపు గంట సేపు యువకుడిని అదే పనిగా కొట్టడంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అనంతరం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు సహా వారికి సహకరించిన 9 మంది నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకెళ్లారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. చేతికి వచ్చిన కుమారుడిని కోల్పోవడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కుమారుడిని పొట్టనబెట్టుకున్న నిందితులను తమకు అప్పగించాలంటూ స్టేషన్ బయట బైఠాయించారు. న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. చివరకు నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు.
Inter Student Suicide in Hyderabad : ''సారీ అమ్మానాన్న'.. ఇదే నా చివరి రోజు ఇక నేను వెళ్తున్నా..'
అనుబంధాలను సమాధి చేసిన కుమారుడు, తల్లిని శ్మశానంలో వదిలేశాడు