ప్రపంచ దేశాలతో సత్సంబంధాలకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని లియోనియా రిసార్టులో ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ‘ఫోర్తు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ యూత్ సమ్మిట్’ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీ-20 సమావేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తోందని.. ఆసియా దేశాల్లో సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు ఇలాంటి సమ్మేళనాలు దోహదపడతాయన్నారు.
ఇండో ఏసియన్ పసిఫిక్ రీజియన్‌లో శాంతికి ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. ఈ వేదికతో ఈశాన్య దేశాల ప్రతినిధులు ఆయా దేశాల మధ్య వారధులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రాంతాల మధ్య వ్యూహాత్మకంగా చర్చలు జరిగేందుకు కృషిచేయాలని సూచించారు. ప్రపంచ దేశాలు సైతం రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను అనుసరిస్తున్నాయన్నారు. ఈ యువ సమ్మేళనానికి ఫిలిప్పీన్స్, సింగపూర్, బ్రూనై, దారుసలాం, కొలంబియా, ఇండోనేసియా, లావ్ పీపుల్స్ డెమొక్రటిక్ రిపబ్లిక్, మలేసియా, మయన్మార్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల నుంచి 110 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
భారత్ తరఫున 40 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. అనంతరం వివిధ దేశాల కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ ప్రతినిధి రామ్‌మాధవ్, ఫౌండేషన్ డైరెక్టర్ మేజర్ జనరల్ ధ్రువ్‌సీ కొటాఛ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: