‘‘నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో పెట్టిన పార్టీని.. ఉద్యమ ముసుగులో బలోపేతం చేసుకున్నావ్. ప్రయోజనం పొందినవ్. ఇప్పుడు నీళ్లేమో జగన్‌రెడ్డి తీసుకుపాయె.. నిధులేమో నీ జేబులోకి పాయె.. నియామకాలేమో నీ ఇంటికి వచ్చె.! తెలంగాణ ప్రజలకు ఏమొచ్చింది? అని ప్రజల తరఫున ముఖ్యమంత్రిని అడుగుతున్నా. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంత అణచివేతకు గురవుతోందో చూస్తున్నాం.. ఆయన నుంచి విముక్తి కల్పిస్తేనే అభివృద్ధి జరుగుతుంది’’ అని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. పీసీసీ ఆధ్వర్యంలో 48 గంటల దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష మంగళవారం సీఎం దత్తత గ్రామమైన మూడుచింతలపల్లిలో ప్రారంభమైంది. ఉదయం కట్టమైసమ్మ ఆలయంలో రేవంత్ పూజలు చేసి.. భారీ ర్యాలీగా మూడుచింతలపల్లిలోని దీక్షాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్, కేశవరాన్ని దత్తత తీసుకున్నా నేటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. దత్తత ముసుగులో ప్రజలను కేసీఆర్ వంచిస్తున్నారని ఆరోపించారు.
కడుపు రగిలిపోయింది
‘‘2015లో కరీంనగర్ జిల్లాలోని చిన్న ముల్కనూరు గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని కేసీఆర్ ప్రకటించారు. అందరికీ ఇళ్లు కట్టిస్తానని 245 గృహాలు నేలమట్టం చేసి.. నేటికీ కొత్తవి కట్టివ్వలేదు. కూలగొట్టిన పేదోళ్ల ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలుంటే.. ఎక్కడ ఉండాలో తెలియక గుడిసె వేసుకుని.. పక్కన తడికలతో కట్టిన స్నానాల గదిలో ఆడపిల్లలు స్నానం చేస్తుంటే పోకిరీలు.. పిల్లల్ని చూస్తున్నారని ఆ తల్లిదండ్రులు నాకు చెబుతుంటే.. కడుపు రగిలిపోయింది.
ఎంపీ పదవికి రాజీనామా చేస్తా
లక్ష్మాపూర్‌లో ధరణి ప్రారంభించారు. ప్రస్తుతం ధరణి వెబ్‌సైట్‌లో ఆ గ్రామ పటమే లేదు. రైతులకు రైతుబంధు, రైతుబీమా వస్తలేదు. కేశవరంలోనూ పథకాలు అందడం లేదు. అర్హులకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు ఇచ్చావా..? దళితులకు మూడెకరాల భూమి ఇచ్చావా..? రూ.లక్ష రైతు రుణమాఫీ చేశావా..? ఉచిత నిర్బంధ విద్య అందించావా..? లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చావా..? ఏమిచ్చినవో చెప్పు.. ఇక్కడే 48 గంటలు ఉంటా.. పంచాయితీ పెడదాం. నేను చెప్పింది తప్పయితే ముక్కు నేలకు రాస్తా.. నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల అని గోరటి వెంకన్న రాసిన పాట తగ్గట్టుగా ఆనాడు పరిస్థితి ఉందో లేదో కానీ.. ప్రస్తుతం తెలంగాణ పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. తెలంగాణను కేసీఆర్ చేతికి ఇచ్చినప్పుడు 16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉంది. దాన్ని దివాలా తీయించారు. ఇవాళ 4.5 లక్షల కోట్ల అప్పులు చేసి.. పుట్టబోయే బిడ్డ నెత్తిమీదా రూ.లక్ష అప్పు మోపారు.
వెళ్లలేకపోతే గుండు కొట్టించుకుంటా
‘గజ్వేల్‌కు వచ్చే నెలలో వస్తా.. కాంగ్రెస్ జెండా ఎగరేస్తా. నన్ను అడ్డుకుంటానంటున్న తెరాస నాయకులను తొక్కుకుంటూ వెళతా. లేకపోతే అక్కడే గుండు కొట్టించుకుంటా. కేసీఆర్ మనమడు చదివే బడిలో పేదోళ్లు చదువుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకువస్తే.. కేసీఆర్ దాన్ని తుద ముట్టించార’ని రేవంత్ అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే: భట్టి
వనరులన్నీ సమానంగా పంచాలని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, కేవలం కొద్దిమంది చేతుల్లోనే దోపిడీకి గురవుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలని, అన్ని వర్గాలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఆత్మగౌరవ పోరాటం ప్రారంభించామని చెప్పారు.
రాత్రి అక్కడే నిద్ర
మూడుచింతలపల్లిలోని ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు బూరుగు ఆంజనేయులు ఇంట్లో రేవంత్‌రెడ్డి రాత్రి బస చేశారు. ఎమ్మెల్యే సీతక్క, సీనియర్ నేతలు షబ్బీర్‌అలీ, మధుయాస్కీగౌడ్, అజారుద్దీన్, మహేశ్‌కుమార్‌గౌడ్, మహేశ్వర్‌రెడ్డి, అంజన్‌కుమార్, పొన్నాల లక్ష్మయ్య, నందికంటి శ్రీధర్, బలరాంనాయక్, రాములు నాయక్ దీక్షలో పాల్గొన్నారు.
హుజూరాబాద్ ప్రజల కాళ్లు పట్టుకుంటా
హైదరాబాద్‌లో వరదలు వస్తే 3 లక్షల కుటుంబాలకు పది వేలు ఇవ్వలేని వ్యక్తి.. రాష్ట్రంలో 30 లక్షల దళిత, గిరిజన కుటుంబాలకు రూ.పది లక్షల చొప్పున ఎలా ఇస్తారు. ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ వద్ద 9.50 లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. హుజూరాబాద్‌లోని దళిత కుటుంబాలకు చేతులెత్తి దండం పెడుతున్నా. కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నా. రాష్ట్రంలో లక్షల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇప్పించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యేసరికి ఎన్నికల కోడ్ వస్తుంది. అప్పుడు ఓట్లు వేస్తేనే సొమ్ము ఇస్తానని కేసీఆర్ మభ్యపెట్టే అవకాశముంది. పది లక్షలు ఇచ్చి ఇంటిపై జెండా.. ఇంట్లో కేసీఆర్ ఫొటో పెట్టుకోవాలంటున్నారు. మరి ప్రజలు రెండుసార్లు సీఎంను చేసినందుకు కేసీఆర్ తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి దళితుల కాళ్లకు తొడగాలి. ఈటల రాజేందర్ దళితుల భూములు, దేవుడి మాన్యాలు ఆక్రమించుకున్నారో లేదో తెలియదు కానీ చర్చ మాత్రం నడిచింది. ఆయన భాజపాలో చేరాక నెలల తరబడి నివేదిక ఎందుకు ఇవ్వడం లేదు?
నువ్వు దత్తత తీసుకున్న గ్రామంలో దళితులు ఉన్నరు, బలహీన వర్గాలు, చదువుకున్న పిల్లలు, మహిళలు ఉన్నరు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినవ? దళితులకు మూడెకరాల భూమి ఇచ్చినవ? చదువుకున్న పిల్లలకు నౌకర్లు ఇచ్చినవ? నువ్వు చేస్తా అన్న లక్ష రూపాయల రుణమాఫీ చేసినవ? కేజీ టు పీజీ ఉచిత నిర్భంద విద్య అందించినవ? నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చినవ? ఇంటింటికి నళ్లా ఇచ్చినవ? ఏం ఇచ్చినవో రా... రేపు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటా. బొడ్రాయి కాడ పంచాయితీ పెడ్దం. నేను చెప్పింది తప్పయితే ముక్కునేలకు రాస్త. నా ఎంపీ పదవికి రాజీనామా చేస్త.
--- రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇదీ చూడండి: REVANTH REDDY: మూడుచింతలపల్లిలో రేవంత్ రెడ్డి దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష