ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికులు తమ డిపోలకు తరలివస్తున్నారు. ముందుగా చనిపోయిన కార్మికులకు నివాళులు అర్పించి... విధుల్లో చేరుతున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా హకీంపేట డిపో వద్దకు ఉదయం నుంచే కార్మికులు తరలివచ్చారు. చనిపోయిన వారికి నివాళిగా డిపో వద్ద కాసేపు మౌనం పాటించారు. అనంతరం విధుల్లో చేరారు.
ఎలాంటి షరతులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తమను విధులకు అనుమతించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి మరింత కష్టపడి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాలు పొందేలా చేస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
కూకట్పల్లి, కుషాయిగూడలోనూ...
మరోవైపు కూకట్పల్లి, కుషాయిగూడ డిపోల వద్ద సైతం కార్మికులతో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే కార్మికులు విధులకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమ కష్టాలను అర్థం చేసుకుని... ఎలాంటి షరతులు లేకుండా విధులకు అనుమతించడం పట్ల కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.
52 రోజుల సమ్మె అనంతరం శాశ్వత ఆర్టీసీ కార్మికులతో బస్సులు రోడ్ల పైకి వచ్చాయి.
ఇదీ చదవండిః రాజధాని శివారులో మహిళా వైద్యురాలి దారుణహత్య