Revanth Reddy Corner Meeting in Jawahernagar : రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణను ఆగమాగం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ(Congress) ఎన్నికల ప్రచారంలో భాగంగా.. జవహర్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్ ప్రసంగించారు. ఇక్కడి ప్రజలకు కేసీఆర్ ఇచ్చిందేంలేదని.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డేనని ఎద్దేవా చేశారు. ఇక్కడి ప్రాంతంలోని డంపింగ్ యార్డు తరలింపునకు కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు.
'కరెంట్, రైతుబంధుపై- కేసీఆర్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారు'
Telangana Assembly Elections 2023 : కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) మేడ్చల్ జిల్లాలో.. తోడు దొంగళ్లా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవవర్గంలో మల్లారెడ్డి పేదోళ్ల గుడిసెలు కూల్చి.. వారికి నిలువ నీడ లేకుండా చేశాడని దుయ్యబట్టారు. పేదలపై ప్రతాపం చూపే అధికారులు.. చెరువులను మింగిన మల్లారెడ్డిపై చర్యలెందుకు తీసుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల పక్కన భూములు కొని.. చెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి అని ఆరోపించారు.
టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి.. కేసీఆర్ మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడని దుయ్యబట్టారు. మరీ కేసీఆర్ ఎన్ని వందల కోట్లకు టికెట్ అమ్ముకున్నారని ప్రశ్నించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిందని.. తెలంగాణను ఆగం చేసిన కేసీఆర్‌ను పొలిమేరలు దాటే వరకు తరమాలని ప్రజలను కోరారు.
Congress Election Campaign : మేడ్చల్‌కు.. రాష్ట్రప్రభుత్వం తెస్తామన్న ఐటీ పార్కు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ముదిరాజ్‌లకు ఒక్కసీటు కూడా కేసీఆర్ ఇవ్వలేదని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా మేడ్చల్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో జరిగిందే తప్ప బీఆర్ఎస్ చేసిందేం లేదని విమర్శించారు.
తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం - 2050 విజన్‌తో ప్రజల ముందుకు : రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. మేడ్చల్‌కు డిగ్రీ కాలేజీ, వందపడకల హాస్పిటల్ తెస్తామని హామీ ఇచ్చారు. పేదల ప్రభుత్వం రావాలంటే.. దొరల రాజ్యం కూలాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దింపే సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు హామీలను అమలుచేసి తీరుతామన్నారు.
"సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో తోడు దొంగళ్లా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. మేడ్చల్‌కు.. రాష్ట్రప్రభుత్వం తెస్తామన్న ఐటీ పార్కు ఎక్కడికి పోయింది. ఇక్కడి ప్రజలకు కేసీఆర్ ఇచ్చిందేంలేదు.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డే. తెలంగాణను ఆగం చేసిన కేసీఆర్‌ను పొలిమేరలు దాటే వరకు తరమాలి". - రేవంత్‌రెడ్డి
"మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఏ హామీని నెరవేర్చలేదు. మంత్రి మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలకు, విశ్వవిద్యాలయానికి అనుమతి ఇచ్చాడు.. కానీ మేడ్చల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఎందుకుంటే పేద పిల్లలు చదువుకుని.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని కేసీఆర్‌కు భయం". - మేడ్చల్ రోడ్‌షోలో రేవంత్‌రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే యువత అడవిబాటే : రేవంత్ రెడ్డి