కరోనా కష్ట సమయంలో బాధితులకు ప్రాణవాయువు అందించనున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. నేరెడ్‌మెట్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్, డీఆర్డీవో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఫ్లాస్మా డొనేషన్‌కు సంబంధించిన వెబ్సైట్, షార్ట్ ఫిలింను సీపీ ప్రారంభించారు.
హోం ఐసోలేషన్ లో ఉన్న బాధితులకు ఆక్సిజన్ అవసరమైన సమయంలో కమిషనరేట్‌లోని కొవిడ్ కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నంబర్ 9490617234 కి కాల్ చేయాలని సూచించారు. ఆక్సిజన్ అవసరం ఉన్నవాళ్లు డాక్టర్ ప్రిస్కిప్షన్, ఆధార్ కార్డు, పాజిటివ్ రిపోర్ట్ చూపిస్తే సిలిండర్ అందిస్తామని తెలిపారు.
కోలుకున్నవారు ఫ్లాస్మా డొనేట్ చేయాలి
కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని సీపీ మహేశ్ భగవత్ కోరారు. పదిహేను రోజుల తర్వాత ఎవరైనా ప్లాస్మా డొనేట్ చేయవచ్చని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ వ్యక్తి 21 సార్లు ఫ్లాస్మా దానం చేశారని ఆయన గుర్తు చేశారు. మా వెబ్ సైట్ ద్వారా ఏ బ్లడ్ గ్రూప్ వారైనా తమను సంప్రదించవచ్చని సీపీ విజ్ఞప్తి చేశారు. మహిళా పోలీసులు కూడా ఫ్లాస్మా దానం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువత ముందుకు రావాలని సీపీ కోరారు.