మేడ్చల్ జిల్లా నేరెడ్మెట్ పరిధిలోని దీనదయాళ్ నగర్లో నాలాలో పడి 12 సంవత్సరాల సుమేధ అనే బాలిక చనిపోయిన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు. కొద్దిపాటి వర్షానికే మోకాలి లోతు నీళ్లు చేరి.. నాలా ఎక్కడుందో.. గుంత ఎక్కడుందో.. మ్యాన్‌హోల్ ఎక్కడుందో తెలియని ప్రాంతాలు హైదరాబాద్‌లో చాలా ఉన్నాయి. నేరెడ్‌మెట్‌లోని సుమేధ ఘటన జరిగిన ప్రదేశంలో వర్షం లేనప్పుడు నాలా ఎప్పుడూ తెరిచే ఉండేది. నివాస ప్రాంతాల్లో నాలా తెరిచి ఉంచిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా ముక్కుపచ్చలారని బాలిక మృత్యువాత పడింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనతో అప్రమత్తమైన నేరెడ్మెట్ పోలీసులు వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో నిల్చొని.. నాలా ఉన్నవైపు జనాలు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు. నిత్యం కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు మీద వరద నీళ్లు ప్రవహిస్తూ.. నాలాలు, గుంతలు కనిపించని పరిస్థితి ఉందని.. ప్రజలు రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి : పోలీసుల ముసుగులో సైబర్ నేరగాళ్ల కొత్త మోసం