పరిశ్రమల్లో వెలువడిన వ్యర్థ రసాయనాలను శుద్ధి చేయకుండానే గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో నాలాల్లోకి వదిలేస్తుండగా కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. మేడ్చల్ జిల్లా జీడీమెట్ల పారిశ్రామికవాడలో అరోరే గ్రూప్‌నకు సంబంధించిన పరిశ్రమల నుంచి సేకరించిన వ్యర్థాలను రాత్రి సమయాల్లో నాలలోకి వదిస్తున్నారని కొందరు స్థానికులు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రాత్రి సమయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల మేరకు 2 నెలల క్రితం పరిశ్రమల్లో తనిఖీల కోసం ప్రత్యేక బృందాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.
శనివారం రాత్రి తనిఖీలు చేస్తుండగా ఓ పైపుతో నాలలోకి వ్యర్థాలు వదిలేస్తుండగా అధికారులు గుర్తించారు. పైపును స్వాధీనం చేసుకుని... పరిశ్రమ నిర్వాహకులను అడగ్గా తమకు తెలియదని బుకాయించారు. పరిశ్రమలోని సిబ్బందికి తెలియక నాలలోకి వదిలారని పీసీబీ అధికారులకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి... సదరు పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని కాలుష్య నియంత్రణ మండలి అధికారి ప్రవీణ్ తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఐదు పరిశ్రమలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.