మేడ్చల్ జిల్లా అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు బహిర్గతం అయ్యాయి. జడ్పీ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఘట్‌కేసర్ మండల పరిషత్ అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి మధ్య వివాదం మరోసారి చోటు చేసుకుంది. జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డికి ఘట్ కేసర్ మండల పరిషత్ కార్యాలయంలో ఓ గదిని అధికారులు కేటాయించారు. తనకు సమాచారం ఇవ్వకుండా జడ్పీ ఛైర్మన్‌కు గది ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నిస్తూ కార్యాలయం ముందు ఎంపీపీ సుదర్శన్ రెడ్డి బైఠాయించి ఆందోళన చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా గది కేటాయించారని ఎంపీపీ ఆరోపించారు. ప్రభుత్వం అధికారికంగా మేడ్చల్‌లో జడ్పీ ఛైర్మన్‌కు కార్యాలయం కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తానూ ఘట్ కేసర్ మండలం నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైనందుకే అధికారులు ఇక్కడ గది కేటాయించినట్లు జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి చెప్పారు. మండల ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులు గదిని ఇచ్చారని అన్నారు. గతంలో ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులకు కేటాయించిన గదిని తనకు ఇప్పుడు అందుబాటులో ఉంచారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని వివాదం చేయడం మంచిది కాదని శరత్ వెల్లడించారు.
ఇదీ చూడండి : బాటసారులను దోచుకుంటున్న ముగ్గురు నిందితులు అరెస్ట్