రాష్ట్రంలో 'ఈచ్ వన్ ప్లాంట్ వన్' నినాదంతో హరితహారం కార్యక్రమం ముందుకు సాగుతోందని మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగర పాలక సంస్థ గౌతమ్ నగర్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మేయర్ బుచ్చిరెడ్డిలతో కలిసి మంత్రి మొక్కలు నాటి నీరు పోశారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి మానస పుత్రిక హరితహారం ఒకటని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా, అన్ని రకాలుగా అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా మలుచుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
ప్రస్తుతం పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించటం, రానున్న తరాలకు ఆరోగ్యకరమైన వాతావారణాన్ని అందించటమే లక్ష్యమన్నారు. ఐదేళ్లుగా దిగ్విజయంగా కొనసాగిన హరితహారం ఇప్పుడు ఆరో విడతకు చేరుకుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని సూచించారు.
ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యం నెరవేరాలన్నారు. కరోనా ప్రభావం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని మంత్రి సూచించారు.
ఇవీ చూడండి: వృద్ధులపై కబ్జాదారుల దాడి.. పోలీసులపైనా దౌర్జన్యం