హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మలేషియా టౌన్‌షిప్ (Malasiya township) రెయిన్ ట్రీ పార్క్ 35 ఎకరాల విస్తీర్ణంతో 37 బ్లాకులుగా విస్తరించింది. సుమారు 7 వేల మంది జనాభా నివసిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ (Corona second wave) ఒకరితో మొదలై దాదాపు 70 మందికి పాజిటివ్‌గా తేలింది. పరిస్థితి చేయిదాటి పోతోందని గ్రహించిన వెల్ఫేర్ అసోసియేషన్ తక్షణం అప్రమత్తమైంది. టౌన్‌షిప్ (Township) నుంచి మహమ్మారి భూతాన్ని తరిమికొట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.
కార్యచరణ...
కాలనీవాసులతో చర్చించి నిర్ధిష్ట కార్యచరణ రూపొందించారు. వాట్సప్ గ్రూపు ఏర్పాటుచేసి కాలనీ వాసులతో కరోనా (Corona) నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. కరోనా కట్టడికి మొదటగా టౌన్‌షిప్‌లో పనిచేసే 117 మంది కార్మికులకు వ్యాక్సినేషన్ (Vaccination) చేయించారు. సోడియం హైపో క్లోరైడ్ ద్రావకాన్ని తరుచూ పిచికారీ చేయించారు. వైరస్ సోకిన వారికి పోషకాహార సరఫరా బాధ్యతను అసోసియేషన్ తీసుకుంది. అత్యవసర వైద్యం కోసం ఐదు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చుకున్నారు. బయటి వ్యక్తులను అపార్ట్‌మెంట్ కింది వరకే అనుమతించారు.
త్వరగా అదుపులోకి...
అసోసియేషన్ ప్రతినిధులు చొరవ తీసుకుని చిత్తశుద్ధితో చేపట్టిన చర్యలతో మహమ్మారి త్వరగానే అదుపులోకి వచ్చింది. ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న వ్యక్తులను స్వీయ నిర్బంధంలో ఉంచడం వల్ల వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకట్ట పడింది. టౌన్‌షిప్‌లో ఐదు కరోనా (Corona) కేసులకే పరిమితమయ్యాయి. మరిన్ని నియంత్రణ చర్యలతో కేసులను సున్నా స్థాయికి తెచ్చి ఆదర్శవంతమైన టౌన్‌షిప్‌గా నిలబెట్టాలని కృషి చేస్తున్నామని సంక్షేమ సంఘం తెలిపింది.
ఆదర్శం...
మలేషియా టౌన్‌షిప్ (Malasiya township) అసోషియేషన్ అవలంభించిన విధానాలు... మిగతా గేటెడ్ కమ్యూనిటీలకు ఆదర్శవంతం, ఆచరణీయం. కరోనా బాధితులకు వైద్యంతో పాటు సమతుల ఆహారం, మానసిక స్థైర్యంతో వైరస్‌ను జయించొచ్చని నిరూపించింది మలేషియా టౌన్‌షిప్ రెయిన్ ట్రీ పార్క్ అసోసియేషన్.