మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం తూంకుంట గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామారావు స్థానికంగా ఉంటూ భవన నిర్మాణాలకు మేస్త్రీగా పని చేస్తూ జీవిస్తున్నాడు. బుధవారం సాయంత్రం భాస్కర్ అనే తోటి మేస్త్రీతో కలిసి బయటకు వెళ్ళాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రైనా ఇంటికి రాక పోయే సరికి పోలీసులకు పిర్యాదు చేశారు కుటుంబీకులు.
నిర్మానుష్య ప్రాంతంలో విగత జీవిగా పడి ఉండడం చూసి బోరున విలపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న బాలానగర్ డీసీపీ పద్మజ, స్థానిక సిఐ నవీన్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. తలకు బలమైన గాయం కావడం వల్ల మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : 'అమ్మాయికి ఆటలెందుకని చిన్నచూపు చూస్తారు'