Godavari Express derailed: అది గోదావరి ఎక్స్‌ప్రెస్. ప్రయాణికులతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరింది. తమ గమ్యస్థానం దగ్గరపడుతుండటంతో అప్పటి వరకు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులంతా అప్పుడప్పుడే మెల్లిగా నిద్ర లేస్తున్నారు. రాత్రంతా ఏవేవో కలల్లో తేలియాడిన వారంతా.. కలల్లోంచి నిజ జీవితంలోకి వస్తున్నారు. కొందరేమో వేకువజామునే లేచి ఇళ్లకు వెళ్లేందుకు అందంగా అద్దాల ముందు రెడీ అవుతున్నారు. మరికొందరేమో తమ వెంట తెచ్చుకున్న లగేజీని జాగ్రత్తగా ఒక్కచోట సర్దుకుంటున్నారు. ట్రైన్ దిగడమే ఆలస్యం.. లేట్ చేయకుండా ఇంటికి వెళ్లిపోయి ఎవరి పనులకు వారు వెళ్లిపోవాలని ప్లాన్స్ వేసుకుంటున్నారు.
Godavari Express derailed at Ankushapur: ఇలా రైలులో ఉన్నవారంతా ఎవరి ఆలోచనల్లో వారు బిజీగా ఉండగా.. ఒక్కసారిగా ఏదో ఊహించని కుదుపు వారి ఆలోచనలన్నింటికీ బ్రేక్ వేసింది. ఏమైందో అర్థం అయ్యేలోపే రైలులో ఉన్న వారంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. ఇంతలో ఆగకూడని ప్రదేశంలో ట్రైన్ ఆగిపోయింది. క్షణం ఆలస్యం చేయకుండా ట్రైన్‌లో ఉన్న వారంతా కిందకు దిగేశారు. అప్పుడు అర్థమైంది వారికి ట్రైన్ ప్రమాదానికి గురైందని.
Godavari Express derailed at Ghatkesar : విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న రైల్వే అధికారులు.. ''మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం అంకుషాపూర్ వద్ద ట్రైన్ పట్టాలు తప్పింది. ఎస్1, ఎస్2, ఎస్3, ఎస్4 మొత్తం 4 బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. ఊహించని ఘటనతో రైలులోని ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక హాహాకారాలు చేశారు. రైలు వేగం తక్కువగానే ఉండటంతో లోకో పైలట్ వెంటనే ట్రైన్‌ను నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులంతా రైలులోంచి కిందకు దిగేశారు.
ప్రమాదంలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బోగీలు పట్టాలు తప్పినప్పటికీ.. కిందపడకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులందరినీ గమ్యస్థానాలకు చేర్చాం. మిగతా 15 బోగీలను హైదరాబాద్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విశాఖ-మహబూబ్‌నగర్ స్పెషల్ ట్రైన్ బీబీనగర్ స్టేషన్‌లో నిలిపివేశాం. ఈ మార్గం గుండా వెళ్లే మరిన్ని రైళ్లు ఆలస్యంగా వెళ్లే అవకాశం ఉంది'' అని వివరించారు.
పలు రైళ్ల రద్దు..: ఇదిలా ఉండగా.. రైలు పట్టాలు తప్పిన అవుషాపూర్ వద్ద సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. దీంతో తిరుపతి-పూర్ణా (నాందేడ్) వెళ్లే స్పెషల్ ట్రైన్‌ను భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్‌లో నిలిపివేసిన అధికారులు.. దిబ్రూగఢ్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలును భువనగిరిలో నిలిపివేశారు. మరోలైపు పలురైళ్లను రద్దు చేశారు. కాచిగూడ-నడికుడి, నడికుడి-కాచిగూడ, సికింద్రాబాద్-రేపల్లె రైళ్లు, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-హైదరాబాద్ రైళ్లు, సికింద్రాబాద్-గుంటూరు, గుంటూరు-సికింద్రాబాద్ రైళ్లతో పాటు మరో 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.
ఇవీ చూడండి..