ప్రజలెవరూ అనవరంగా రహదారులపైకి రాకుండా లాక్‌డౌన్‌కు సహకరించాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. హైదరాబాద్ మహానగరంలో జనసాంద్రత ఎక్కువగా ఉండటం లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. కొన్నిచోట్ల యువకులు అకారణంగా బయటికి వస్తున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలిందని.. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని మహేందర్ రెడ్డి సూచించారు.
అత్యవసర సర్వీసులతో పాటు... ప్రభుత్వం మినహాయింపునిచ్చిన రంగాలకు చెందిన వాళ్లకు ఎలాంటి అనుమతి అవసరం లేదని.. నిర్ధరించిన సమయంలో ఆయా రంగాలకు చెందిన వాళ్లు పనులు చేసుకోవచ్చని మహేందర్ రెడ్డి తెలిపారు.
పాస్‌లు దుర్వినియోగం చేస్తే చర్యలు
ప్రజల సహకారంతోనే లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేయడం సాధ్యమవుతోందని మహేందర్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ జంక్షన్ వద్ద ఉన్న పోలీసు తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ-పాస్‌లు దుర్వినియోగం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్స్‌లను కూడా పంపిస్తున్నామని తెలిపారు. డెలివరీ బాయ్స్ తమకు కల్పించిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.