రియల్టర్ నల్ల మల్లారెడ్డి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కాచావాని సింగారం గ్రామంలోని దివ్యనగర్ వెంచర్ ఫ్లాట్లు కొనుగోలుదారులు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.
జిల్లాలోని కాచావాని సింగారం గ్రామం దివ్య నగర్ వెంచర్లో 1993లోనే 4,500 మంది సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ప్లాట్లు కొనుగోలు చేశారని బాధితుల తరపు న్యాయవాది రాపోలు ఆనంద్ భాస్కర్ తెలిపారు. ఫ్లాట్ల అభివృద్ధి కోసం వెంచర్ యజమాని నల్ల మల్లారెడ్డి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. లక్షల్లో వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరైనా ఫ్లాటును అమ్ముకోవాలంటే ఐదు నుంచి పది లక్షలు చెల్లించాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని బాధితులు తెలిపారు. తనకు మంత్రులు మల్లారెడ్డి, ఈటెల రాజేందర్ల అండదండలు ఉన్నాయని... ఎవరూ ఏమి చేయలేరని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీ, రాచకొండ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసిందని న్యాయవాది వివరించారు.
ఇదీ చదవండి: మందకృష్ణ, బండారి మధ్య వాగ్వాదం