మేడ్చల్ మల్కాజిగిరిలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెరాస-భాజపా కార్యకర్తల మధ్య మాటామాటా పెరగటంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో భాజపాకు చెందిన కార్పొరేటర్ శ్రవణ్‌పై తెరాస కార్యకర్తలు దాడిచేయటంతో.. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన కార్పొరేటర్ శ్రవణ్‌ను ఆస్పత్రికి తరలించారు. కార్పొరేటర్‌పై దాడిని నిరసిస్తూ భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
పరామర్శించిన బండి సంజయ్, విజయశాంతి
ఈ గొడవలో గాయపడిన మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్‌ను విజయశాంతితో కలిసి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. తెరాస కార్యకర్తలు గూండాలుగా వ్యవహరిస్తూ దాడులకు తెగబడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కార్పొరేటర్ శ్రవణ్‌ను బీరు బాటిళ్లతో కొట్టడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
ఖండించిన రాజాసింగ్
భాజపా కార్పొరేటర్‌పై దాడిని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు తెరాస దాడులకు దిగటం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహా దాడికి పాల్పడిన తెరాస కార్యకర్తలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: CM KCR: దళితబంధు ఓ పథకం కాదు.. ఉద్యమం: కేసీఆర్