మేడ్చల్ జిల్లా రాంపల్లి భూవ్యవహారంలో పట్టుబడ్డ కీసర తహసీల్దార్ నాగరాజు అక్రమాలు తవ్వేకొద్దీ బయటకొస్తున్నాయి. ఏకంగా కోటి 10లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన నాగరాజుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివాదాస్పద భూములు పరిష్కరించేందుకు లక్షల్లో లంచాలు తీసుకుంటాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ పనిచేస్తే అక్కడ భూవివాదాలను ముందే తెలుసుకుని.... పాత తేదీలతో ఆ భూములకు సంబంధించిన పత్రాలను తయారు చేయడంలో నాగరాజు ఆరితేరాడు.
ఇలా చిక్కాడు
రాంపల్లి భూవివాదానికి సంబంధించి స్థిరాస్తి దళారులు శ్రీనాథ్, అంజిరెడ్డి.... పరిష్కారం తాలుకా ఏదైనా ఆధారం చూపిస్తే డబ్బులు ఇస్తామన్నారు. దీనితో కలెక్టరేట్‌లోని కొందరు ఉద్యోగుల చేత కలెక్టర్ సంతకం చేయని నకలు తెచ్చి చూపించాడు. దళారుల నుంచి డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా అనిశాకు చిక్కాడు. ఈ భూవివాదానికి సంబంధించి మూడు రోజుల ముందు తహసీల్దార్ సాయంతో ఓ ఉన్నతాధికారికి డబ్బులు ముట్టినట్లు అనిశా అధికారులు గుర్తించారు.
ఇటీవల జిల్లా నుంచి బదిలీపై వెళ్లిన ఓ ఉన్నతాధికారికి స్థానిక తహసీల్దార్ల సాయంతో..... నాగరాజు రెండు ఎకరాల్లో ఓ విల్లాను నిర్మించి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఉన్నతాధికారుల అండదండలతో తహసీల్దార్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నాడు.
అన్నింటా అతని హస్తం ఉండాల్సిందే
కీసర మండలంలోని ఓ ప్రముఖ దేవాలయం పక్కన ఉన్న చెరువుపై...... కొందరు స్థిరాస్తి వ్యాపారులు అభివృద్ధి చేస్తున్న 22 ఎకరాల లేఅవుట్‌లోనూ ఇతను జోక్యం చేసుకున్నాడు. సుమారు మూడు నుంచి నాలుగు కోట్లు విలువ చేసే ఎకరం శిఖం భూమిని.... పార్కుగా చూపి హెచ్ఎండీఏకు ఇచ్చేందుకు ప్రణాళిక రచించారు. చెరువులోని మట్టిని తీసి శిఖం భూమిపై పోసి చదును చేశారు. మొక్కలు నాటేందుకు అక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్.... విషయం తెలుసుకుని నాగరాజుపై అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఆ మట్టిని తిరిగి చెరువులో పోశారు.
ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో రిమాండ్ ఖైదిగా ఉన్న తహసీల్దార్ నాగరాజును... లోతైన విచారణ కోసం అనిశా అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకునే అవకాశముంది.
ఇదీ చూడండి: కీసర తహసీల్దార్ ఇంట్లో సోదాల్లో భారీగా నగదు, నగలు స్వాధీనం