మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిదాయరలో 53 ఎకరాల భూ వ్యవహారంలో పెద్దమొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు సహా రియల్టర్లు శ్రీనాథ్, అంజిరెడ్డి, రాంపల్లి గ్రామ వీఆర్ఏ సాయిరాజ్‌లను కార్యాలయానికి తరలించారు. నాంపల్లిలోని అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసాగిస్తున్నారు.
నాగరాజు గతంలోనూ భూదందాలకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కరించేందుకు డబ్బు డిమాండ్ చేశాడా..? ఫిర్యాదు చేసేందుకు బయటకు రాని బాధితులెవరైనా ఉన్నారా..? తహసీల్దార్‌తో పాటు దళారుల వెనక ఎవరున్నారనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.
మరోవైపు అల్వాల్‌లోని నాగరాజు నివాసంలో, కీసరలోని తహసీల్దార్ కార్యాలయంలో అనిశా సోదాలు కొనసాగుతున్నాయి. ఇంట్లో మరో రూ.28 లక్షలు, బంగారం, ఆస్తుల పత్రాలు, కార్యాలయంలో భూవివాదానికి సంబంధించి దస్త్రాలు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తహసీల్దార్ నాగరాజుతో పాటు మరో ముగ్గురు నిందితులను సాయంత్రం అనిశా ప్రత్యేక జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.
ఇదీచూడండి: రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన కీసర తహసీల్దార్