మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఓ మహిళ రోడ్డుపైనే మృతశిశువుకు జన్మనిచ్చింది. గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది బాధితురాలికి ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే..
మేడ్చల్ పట్టణానికి చెందిన ఓ 8 నెలల గర్భిణీ ఉదయం జవహర్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. ఆసుపత్రి ఆవరణలో ఉన్న అరుగుపై పడుకుంది. గమనించిన ఆసుపత్రి నర్సు ఆమె వద్దకు చేరుకొని ఆరా తీసింది. తన కాలికి దెబ్బ తగిలి, చీము కారుతోందని.. నొప్పి ఎక్కువగా ఉందని చికిత్స అందించాలని గర్భిణీ కోరింది. ప్రస్తుతానికి డ్రెస్సింగ్ చేసే సిబ్బంది లేరని చెప్పిన నర్సు.. పెయిన్ కిల్లర్ ఇచ్చి చికిత్స కోసం వెంటనే గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని సూచించింది.
ఈ క్రమంలోనే గర్భిణీ ఆసుపత్రి సమీపంలోనే రోడ్డుపై ప్రసవించింది. గమనించిన సిబ్బంది మహిళకు ప్రాథమిక చికిత్స అందించారు. అప్పటికే బిడ్డ మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం 108 వాహనంలో మహిళను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి : 'అపోహలు వద్దు.. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోండి'