మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలోని ఊర చెరువులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన వీరబోయిన నాగేశ్, గౌరమ్మలకు కొడుకు అరుణ్, కూతురు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు స్నేహితులతో కలిసితిరిగిన అరుణ్ సాయంత్రం నుంచి కనపడకుండా పోయాడు.
కుటుంబ సభ్యులు ఫోన్ చేసినప్పటికీ అరుణ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. కొడుకు కోసం ఊరంతా గాలించినా లాభం లేకపోయింది. ఆదివారం ఉదయం చెరువువైపు వెళ్లిన గ్రామస్థులకు మృతదేహం కనిపించింది. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం చెరువు అంచు వద్ద ఉండటం చూసిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అరుణ్ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడా.. లేదా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..