Wife And Husband Suicide In Medak : జీవితమంతా తోడుంటానని భర్త భార్యకు, భార్య భర్తకు పెళ్లిలో అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేసుకుంటారు. మూడు ముళ్లతో ఒక్కటయిన వారు చావుతో ఒక్కటిగా ఈ లోకాన్ని విడిచారు. ఏడు అడుగులు వేసేటప్పుడు నూరేళ్లు తోడుంటానన్న భర్త.. చావులోనూ తోడయ్యాడు. గత కొంత కాలంగా వీరి మధ్య చిన్న చిన్న కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ కలహాలను తట్టుకోలేక భార్య బావిలో దూకింది. తనను కాపాడటానికి పోయిన భర్త తన చావులోనూ తోడు అయ్యాడు. వారు చనిపోయే ముందు వారు జన్మనిచ్చిన ఇద్దరు చిన్నారుల గురించి మరిచారు. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు కుమారులు అనాథలుగా మిగిలారు.
బావిలో పడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగ్‌లో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన ధారబోయిన నాగేష్ (40), స్వరూప(35)లు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర పశువుల కాపరులుగా పని చేస్తున్నారు. వారు పొద్దున వచ్చి పశువులను కాయాల్సి ఉండగా.. రాలేదు. ఉదయం నుంచి వారు కనిపించకపోవడంతో శ్రీనివాస్ రెడ్డికి అనుమానం వచ్చింది. వారిద్దరి కోసం గాలించగా శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ బావి వద్ద నాగేష్ స్వరూప చెప్పులు, మొబైల్ ఫోన్ కనిపించాయి. కొద్దిసేపటి తర్వాత భార్యాభర్తల మృతదేహాలు బావిలో తేలాయి. కుటుంబ కలహాలతో భార్య స్వరూప బావిలో దూకగా.. ఆమెను కాపాడటానికి ఆమె భర్త నాగేష్ బావిలో దూకాడు. భార్యను కాపాడటానికి వెళ్లిన భర్త భార్యతో పాటే తాను కూడా మరణించాడని స్థానికులు తెలిపారు.
ఏమీ తెలియని చిన్నారులను అనాథలు చేశారు..: స్వరూప-నాగేష్‌లకు 7 సంవత్సరాల భిక్షపతి, 3 సంవత్సరాల మల్లికార్జున్ చిన్నారులు ఉన్నారు. తల్లిదండ్రుల మృతితో ఏమీ తెలియని చిన్నారులు అనాథలు అయ్యారు. దంపతుల మృతికి సంబంధించి ఎటువంటి వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. విషయం తెలుసుకున్న పాపన్నపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి:
- మెగా ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు.. స్టార్ హీరోయిన్‌తో వరుణ్ తేజ్ వెడ్డింగ్!
- ICC ర్యాంకింగ్స్‌లో దిగజారిన కోహ్లీ స్థానం.. విరాట్‌ను వెనక్కి నెట్టిన ఆ ప్లేయర్ ఎవరంటే?
- Warangal Super Specialty Hospital : సెప్టెంబర్ కల్లా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రెడీ
- కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే.. డిప్యూటీ సీఎంగా డీకే.. మే 20న ప్రమాణం!