కొవిడ్ వ్యాక్సిన్ సంసిద్ధతపై జిల్లా వైద్యారోగ్య అధికారులతో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటి విడతలో వైద్యారోగ్య సిబ్బందికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. జవనరిలో ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు అందించే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో పనిచేస్తున్న 4,073 మంది వైద్యసిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జనవరి 17న పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా 18, 19న ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారని వివరించారు.
విడతలవారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో వ్యాక్సిన్ను అందజేస్తామని తెలిపారు. 50 ఏళ్లు పైబడినవారికి, 50 ఏళ్లలోపు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి వెల్లడించారు. ఈ సమావేశంలో డీఐవో సుమిత్ర రాణి, డీఎస్వో నవీన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి రమేష్, సీడీపీవో పద్మావతి, పురపాలక కమిషనర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.