సాగుకు జవసత్వాలు చేకూర్చాలన్న మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. ఇప్పటికే పది ఎత్తిపోతలల ద్వారా మెదక్ జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ వరకు చేరిన గోదావరి జలాలు ఇక చెరువుల్లోకి పరవళ్లు తొక్కనున్నాయి. తద్వారా అన్నదాత పొలాల చెంతకు చేరి బంగారు పంటలు పండించబోతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2.85 లక్షల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో రూ.1772 కోట్ల వ్యయంతో మర్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా మొత్తం 521 చెరువులను నింపాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం తొలివిడతగా 37 చెరువులకు నీటిని విడుదల చేయనున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు.
60 వేల ఎకరాలకు నీరు
మెదక్ జిల్లా పరిధిలోని జగదేవపూర్ మండలంలో 28 చెరువులు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని 9 చెరువులకు నేటి నుంచి నీరు చేరనుంది. ఈ చెరువుల కింద సుమారు 60 వేల ఎకరాలకు నీరందించేందుకు చర్యలు చేపట్టారు. నీళ్లు లేక బీళ్లు పడిన పొలాలకు గోదావరి నీటితో పునర్ వైభవం తీసుకొస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, గత నెల 29న కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోసే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెల్సిందే. మూడు వారాలుగా పలు దఫాలుగా పంపింగ్ చేసిన అధికారులు సీఎం ఆదేశాల మేరకు చెరువుల్లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కొండపోచమ్మ సాగర్‌లో నీటి మట్టం ఆరు టీఎంసీలకు చేరుకున్నట్లు అధికారులు వివరించారు.
రెండో విడతగా వాగుల్లోకి... గజ్వేల్ నియోజకవర్గం మీదుగా ప్రవహించే హల్దీ, కూడవెళ్లి వాగులకు రెండో విడతలో గోదావరి జలాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మర్కూక్ మండలం చేబర్తి చెరువులోకి జలాలు విడుదల చేశారు. ఈ చెరువు అలుగు పారితే కూడవెళ్లి వాగులోకి నేరుగా జలాలు తరలనున్నాయి. వర్గల్ మండలం ఖాన్‌చెరువులోకి నీటిని విడుదల చేస్తే హల్దీ వాగులోకి గోదావరి జలాలు వెళతాయని అధికారులు పేర్కొన్నారు.