మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో దశ ఫార్మాస్యూటికల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటును ఆపాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కాళ్లు పట్టుకొని విజ్ఞప్తి చేశారు. ఈ కంపెనీ నెలకొల్పడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మంగళవారం ఎమ్మెల్యే, నర్సాపూర్ ఆర్డీవో సాయిరాంతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే, అధికారులు పరిశ్రమ నిర్మిస్తున్న ప్రాంతానికి చేరుకోగానే గ్రామస్థులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుతో తమ భూములు విలువ కోల్పోతాయని, భూగర్భజలాలు కలుషితం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని.. తమ భూమిని కాపాడాలని ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్నారు.
స్పందించిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి.. మెదక్‌లో నేడు జరిగే సమావేశానికి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు వస్తున్నారని, ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పారు. అక్కడికి 10 మంది గ్రామస్థులు వచ్చి.. తమ ఆవేదన ఏంటో మంత్రికి వివరంగా చెప్పాలని సూచించారు. టీఎస్‌ఐపాస్ ద్వారా పరిశ్రమ యాజమాన్యం అనుమతులకు దరఖాస్తు చేసుకుందని ఆర్డీవో సాయిరాం తెలిపారు. ఎమ్మెల్యే, ఆర్డీవో అక్కడి నుంచి వెళ్లిపోగానే కొంతమంది యువకులు ఆగ్రహంతో కంపెనీ చుట్టూ నిర్మించిన ప్రహరీపై రాళ్లు విసిరారు. అక్కడున్న పెద్దలు నచ్చజెప్పడంతో అంతా వెళ్లిపోయారు.
ఇదీ చూడండి: Farmer died in Medak district: పొలం పోతుందనే బెంగతో తనువు చాలించిన రైతు