Udandapur Reservoir Expats Problems : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఉదండపూర్ జలాశయం ముంపు బాధితులను పునరావాసం కల్పించడంలో జాప్యం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తోంది. ఎన్నికల ప్రకటనకు రంగం సిద్ధమవుతన్న తరుణంలో మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు ఉదండపూర్ వార్డు సభ్యులు సన్నద్ధమవుతున్నారు. ఉదండపూర్ జలాశయ నిర్మాణంలో ఉదండపూర్, వల్లూరు సహా చుట్టుపక్కల తండాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి.
ఈ గ్రామాల్లో సర్వే నిర్వహించి కోల్పోతున్న ఇళ్లకు పరిహారం, నిర్వాసిత కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ.. ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు.. పునరావాస కేంద్రాన్ని సిద్ధం చేసి ఇవ్వాల్సి ఉంది. మూడేళ్లు గడుస్తున్నా పునరావాసం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారడంతో గ్రామస్థులు స్థానిక ప్రజాప్రతినిధులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. ప్రజలకు న్యాయం చేయలేని ప్రతినిధులు ఎందుకని నిలదీయడంతో.. ఉదండపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ సహా వార్డు సభ్యులు మూకుమ్మడి రాజీనామాలకు సన్నద్ధమయ్యారు. నేటి వరకు (ఈ నెల 6) గడువిచ్చిన వార్డు సభ్యులు.. ప్రభుత్వం స్పందించకపోతే రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇళ్లకే కాదు వాకిళ్లు, ఖాళీ స్థలాలకు పరిహారం ఇవ్వాలి.. ఉదండపూర్ నిర్వాసితుల డిమాండ్
''ఉదండపూర్ జలాశయ నిర్మాణంలో ఉదండపూర్, వల్లూరు సహా చుట్టుపక్కల తండాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఉదండపూర్ ప్రజలు మమ్మల్ని నిలదీయడంతో వార్డు సభ్యులతో కలిసి రాజీనామా చేయాలనుకుంటున్నాం. ఆరు రోజులు ఎమ్మెల్యేకు గడువు ఇచ్చాం. ఉదండపూర్ను ఆదుకుంటామని హామీ ఇచ్చేదాకా మా నిర్ణయాలు విరమించుకోం.''- శేఖర్, ఉప సర్పంచ్
Udandapur Reservoir Expats face Problems : ఉదండపూర్ జలాశయ నిర్మాణం కోసం భూసేకరణ జరుగుతున్నప్పుడు భూములకు పరిహారం, పునరావాస ప్యాకేజీ ఏకకాలంలో చెల్లిస్తామని హామీ ఇచ్చారని.. కానీ అమలు చేయలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇప్పటికీ మూడు సార్లు సర్వే చేసినా సర్వే వివరాలు బయటకు వెల్లడించడం లేదని.. తప్పుల తడకగా సర్వే నిర్వహించారని ఆరోపిస్తున్నారు. పునరావాస కేంద్రంలో నిర్వాసితుల కుటుంబాలకు ఇప్పటికీ ఇళ్ల స్థలాలు కేటాయించలేదని, పునరావాస కేంద్రంలోనూ రహదారులు, మురుగు కాల్వలు, విద్యుత్, మంచినీరు సహా ఏ మౌలిక వసతులు కల్పించలేదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కనికరించాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఉదండాపూర్ జలశాయ నిర్మాణ పనులను అడ్డుకోగా.. ప్రజాప్రతినిధులు సర్దిచెప్పడంతో గ్రామస్థులు సహకరించారు. ఎన్నికల ప్రకటనకు రంగం సిద్ధమవుతున్నా.. ఇప్పటికీ ప్రభుత్వం చలించకపోవడంతో రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు.
పునరావాసం కోసం ఉందడాపూర్ జలాశయం నిర్వాసితులకు తప్పని ఎదురుచూపులు