మెదక్ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది. మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని మంజీరా నది పాయల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి వనదుర్గామాతను దర్శించుకున్నారు. ఒడి బియ్యం పోసి, తలనీలాలు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు గురువారం తెల్లవారు జామున 4 గంటలకు అమ్మవారికి అభిషేకం, అర్చన నిర్వహించి బంగారు ఆభరణాలులతో శోభాయమానంగా ఆలంకరించారు.
మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు, హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వయంభువుగా వెలసిన శ్రీ వనదుర్గ భవానిని దర్శించుకున్నారు.
ఉదయం పూట భక్తుల సంఖ్య తక్కువగా ఉండగా మధ్యాన్నం తరువాత రద్దీ బాగా పెరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని మెదక్ డీఎస్పీ కృష్ణ మూర్తి తెలిపారు.
ఇదీ చదవండి: సందడిగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణోత్సవం