కరోనా నేపథ్యంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫతేనగర్‌లో ప్రైవేటు టీచర్లకు 25 కిలోల బియ్యాన్ని ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
జిల్లాలో ప్రైవేట్ టీచర్లు 1209 మంది ఉన్నారని వారందరికీ రూ. 2 వేలు వారి ఖాతాల్లో వేస్తూనే 25 కేజీల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. మిగిలిన ఉపాధ్యాయులకు కూడా రెండవ విడతలో పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గతేడాది నుంచి జీతభత్యాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. అత్యవసరం అనుకుంటేనే బయటకు రావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రమేష్ కుమార్, జిల్లా క్రీడల శాఖ అధికారి నాగరాజు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు లక్ష్మీ నారాయణ గౌడ్, రాజు కిషోర్సాయి పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.