మెదక్‌లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి గర్భిణుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. వైద్యసేవలు మెరుగ్గా ఉండడం... కేసీఆర్ కిట్ పథకం కారణంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన గర్భిణులు ఆసుపత్రికి వస్తుంటారు. దీంతో ఆసుపత్రిలో ప్రతి నెలా 300 పైగా కాన్పులు జరుగుతుంటాయి. హైరిస్క్ కేంద్రానికి ప్రత్యేకంగా భవనం కేటాయించగా.. ప్రస్తుతం కొవిడ్-19 చికిత్స కోసం వినియోగిస్తున్నారు. ఆసుపత్రి మొదటి అంతస్తులోకి హైరిస్క్ కేంద్రాన్ని తరలించారు. ప్రసవం అనంతరం బాలింతలను ఆసుపత్రిలో రెండు గదులలో వసతి కల్పిస్తున్నారు. ప్రసవాలు ఎక్కువై... గదులు లేకపోతే వరండాలో మంచాలు వేస్తున్నారు. అక్కడ బాలింతలు, శిశువులు వల్ల ఇబ్బందులు పడుతున్నారు. మంచాలకు రక్షణ కవచాలు ఏర్పాటు చేయకపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆయా వార్డులను ప్రసూతి చికిత్సకు కేటాయించడంతో ఇతర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది.
రెండేళ్ల క్రితం మంజూరైనా...
ప్రభుత్వం 2018లో వంద పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్ర భవనం నిర్మించాలని సంకల్పించింది. ఇందుకు ప్రత్యేక నిధులు రూ.17 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)కి అప్పగించింది. అదే ఏడాది ఫిబ్రవరి 11న జిల్లా ఆసుపత్రి ఆవరణలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న పాత భవనాన్ని కూల్చివేసి, పక్కనే ఖాళీస్థలంలో నిర్మించాలని తొలుత నిర్ణయించారు. అప్పటికే ఆసుపత్రిలో డయాలసిస్, ఐసీయూ ఏర్పాటు కావడం.. అధునాతన రీతిలో విశాలంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మించాల్సి ఉండడంతో ఆ ప్రయతాన్ని విరమించుకున్నారు. తర్వాత స్థల సేకరణపై దృష్టి సారించారు. ఈక్రమంలో పిల్లికొట్టాల్‌లో ఐదు ఎకరాలు కేటాయించారు. ఈ మేరకు గతేడాది నవంబరులో పనులను ప్రారంభించారు. ఇప్పటికీ ఆ పనులు కొనసాగుతున్నాయి. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి వినియోగంలోకి తెస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు, ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి పనులను వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
కొన్ని మార్పులు చేర్పులతోనే...
స్థలం ఎంపిక, భవన నిర్మాణ పనులు మొదలు పెట్టాక నమూనాల్లో మార్పులు జరిగాయి. దీంతో జాప్యం జరిగింది. లాక్‌డౌన్ వల్ల రెండున్నర నెలల పాటు పనులకు ఆటంకం ఏర్పడింది. తిరిగి పనులు మొదలుపెట్టాం. సకాలంలో పూర్తి చేసి భవనాన్ని అప్పగిస్తాం.
- జితేందర్, డీఈ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ.