కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను హైకోర్టు వాయిదా వేసింది. మళ్లీ కోర్టు అనుమతితో పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. కరోనా కారణంగా చేపట్టనున్న జాగ్రత్తలు, పరీక్షల నిర్వహణకు తీసుకోనున్న చర్యలపై ప్రభుత్వం నివేదిక సమర్పించనుంది. ఈమేరకు పరీక్షల నిర్వహణకు ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించి పంపాలని జిల్లా విద్యాశాఖను సర్కారు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా అధికారులు ప్రణాళిక రూపొందించారు. పరీక్ష కేంద్రాల్లో భౌతికదూరం పాటింపు, విధిగా మాస్కులు ధరించేలా చేయడం.. అదనపు కేంద్రాల ఏర్పాటుతో పాటు ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారుల నియామకం చేపట్టాలని నిర్ణయించారు.
ప్రత్యామ్నాయ ప్రణాళిక
- భౌతికదూరం పాటించడం. శానిటైజర్లను అందుబాటులో ఉంచడం, మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోనున్నారు.
- భౌతికదూరం పాటించేందుకు ఒక్కో గదిలో కేవలం 12 నుంచి 18 మంది విద్యార్థులు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
- ఒక్కో బెంచీకి ఒకరిని మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతించనున్నారు. ఇది వరకు జరిగిన పరీక్షలో ఒక గదిలో 24 మంది రాశారు.
- గతంతో మూడు కి.మీల లోపు కేంద్రాలు ఏర్పాటు చేయగా... ప్రస్తుతం ప్రధాన పరీక్ష కేంద్రం నుంచి కి.మీల లోపు ఉన్న ప్రభుత్వ, కస్తూర్బా పాఠశాలలను కేంద్రాలుగా ఎంపిక చేశారు.
- ఇదిలా ఉండగా అదనంగా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్ల నియమకానికి కసరత్తు జరుగుతోంది.
పరీక్షల నిర్వహణకు సిద్ధం..
ఇప్పటికే అదనపు పరీక్ష కేంద్రాలను గుర్తించాం. వాటిల్లో సౌకర్యాలు ఉన్నాయి. కేంద్రాల సంఖ్య పెరగడంతో అదనంగా 420 మంది అధికారులు, సిబ్బంది అవసరం. పరీక్షల నిర్వహణకు రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళిక నివేదికను ప్రభుత్వానికి పంపాం. కోర్టు, ప్రభుత్వ ఆదేశాలతో పరీక్షలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం.
- రమేశ్‌కుమార్, జిల్లా విద్యాధికారి
ఇదీ చూడండి: నిరాడంబరంగా వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు