మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యం తడిసి ముద్దయింది. నార్సింగి మండలం షేర్పల్లి గ్రామంలో కష్టపడి పండించిన ధాన్యం వర్షపునీటిలో కొట్టుకుపోయింది. నెల రోజులుగా తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత రాత్రి కురిసిన వర్షానికి గ్రామంలోని 70 మంది రైతుల వరి ధాన్యం కుప్పలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. మరికొందరి ధాన్యం వర్షపునీటి పాలైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట తమ కళ్లముందే వర్షంలో కొట్టుకు పోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరికైతే రాజకీయంగా పలుకుబడి ఉంటారో వారి ధాన్యం ముందుగా తూకం వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వర్షం రాకతో జిల్లాలోని నార్సింగి, రామాయంపేట, చేగుంట, చిన్న శంకరం పేట, నిజాంపేట మండలాలలో ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు చర్యలు తీసుకొని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.