అన్నదాతలు సంఘటితం కావాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలు నిర్మిస్తున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీపీ కార్యాలయ ప్రాంగణంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంపిణీకి ఏర్పాటు చేసిన సమావేశంలో సరైన సదుపాయాలు కల్పించలేదంటూ తహసీల్దార్ బలరాంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు కూరగాయల మార్కెట్ సముదాయం, ఈజీఎంఎస్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నార్సింగి గ్రామ పరిధిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా నిర్మించిన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. సమావేశంలో రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు సోములు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు జగన్, తహసీల్దార్ బలరాం, ఎంపీడీవో శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యురాలు షర్మిల, సర్పంచి గురుమూర్తి గౌడ్, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.
అనంతరం పురపాలక పాలకవర్గం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా మెదక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రగతి పనుల తీరును మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్ ఆమెకు వివరించారు. సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు ఉన్నారు.